
న్యూఢిల్లీ: బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భర్తను నోటికొచ్చినట్టు వాగి.. ఆధారాల్లేకున్నా ఆరోపణలు చేయడాన్ని క్రూరత్వంగానే పరిగణించింది. తాగుబోతు అని, ఇతర మహిళలతో లైంగిక వ్యవహారాలు నడుపుతున్నారని ఎలాంటి సాక్ష్యం లేకుండా ఆరోపణలు చేయడం క్రూరత్వమే అని, దంపతుల విడాకులను సమర్థించింది. దంపతులకు విడాకులు మంజూరు చేస్తూ ఇచ్చిన ఫ్యామిలీ కోర్టు తీర్పును ఎత్తిపట్టింది.
న్యాయమూర్తులు నితిన్ జందార్, శర్మిలా దేశ్‌ముఖ్‌ల డివిజన్ బెంచ్ అక్టోబర్ 12వ తేదీన ఈ సంచలన తీర్పు ఇచ్చింది. 2005 నవంబర్‌లో వెలువడ్డ తీర్పును 50 ఏళ్ల మహిళ సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది. ఆ మహిళకు, ఆర్మీ రిటైర్డ్ అధికారిలకు పూణె కోర్టు విడాకులు ఇచ్చింది. అయితే, ఈ కేసు తీర్పును సవాల్ చేస్తూ ఆమె బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే భర్త మరణించారు. దీంతో సదరు మహిళ పిటిషన్‌పై స్పందించాల్సిందిగా ఆ వ్యక్తి చట్టబద్ధ వారసుడిని ఆదేశించింది.
తన భర్త ఇతర మహిళలతో సంబంధాలు కలిగి ఉన్నాడని, ఆల్కహాలిక్ అని తన అప్పీల్‌లో సదరు మహిళ పేర్కొంది. అందుకే తన వివాహబంధం ద్వారా సంక్రమించే హక్కులు వినియోగించుకోలేకపోయానని వివరించింది.
Also Read: కొడుకునుంచి విడాకులు అడిగిందని.. కోడలిపై ఎన్నారై మామ ఘాతుకం.. ఏం జరిగిందంటే...
ఆమె తన భర్తపై అనవసరమైన, తప్పుడు ఆరోపణలు చేయడం ద్వారా సమాజంలో ఆయన గౌరవాన్ని భంగం కలిగించిందని, అది క్రూరత్వమే అని కోర్టు పేర్కొంది. ఆమె ఆరోపణలు చేయడమే కానీ, ఒక్క ఆధారం కూడా చూపెట్టలదేని వివరించింది.
కాగా, మరణించిన ఆమె భర్త తరఫు న్యాయవాది కోర్టులో వాదిస్తూ.. ఆ మహిళ చేసే తప్పుడు, అవమానకర వ్యాఖ్యల ద్వారా తన క్లయింట్ మానసిక వేదనను అనుభవించాడని పేర్కొన్నారు. ఫ్యామిలీ కోర్టులో తన కలయింట్ పేర్కొన్న వ్యాఖ్యలను ఆయన ఉటంకించారు. తన క్లయింట్‌ను పిల్లలకు, పిల్లల పిల్లలకూ దూరంగానే ఉంచేసిందని వివరించారు.
ఒకరిపై మరొకరు ఏ విధమైన నడవడిక ద్వారానైనా మానసిక బాధన, వేదనను కలిగిస్తే.. అది వారిద్దరూ కలిసి జీవించ ఉండే అవకాశాలను హరిస్తుందని చట్టంలోనూ ఉన్నదని హైకోర్టు తెలిపింది. తన రిటైర్డ్ ఆర్మీ భర్తపై చేసిన తప్పుడు, అవాంఛనీయ వ్యాఖ్యల కారణంగా సమాజంలో ఆయన తన ప్రతిష్టను కోల్పోయారని వివరించింది.హిందూ మ్యారేజ్ యాక్ట్‌లోనూ సెక్షన్ 13(1)(ఐ-ఏ) కింద పిటిషనర్ నడవడిక క్రూరత్వంగానే ఉన్నదని, కాబట్టి, విడాకులు ఇవ్వడమే సరైందని కోర్టు తెలిపింది.