
న్యూఢిల్లీ: పాత పార్లమెంట్ భవనం వద్ద మంగళవారంనాడు ఫోటో సెషన్ కొనసాగింది. ప్రధాని నరేంద్రమోడీ సహా పలువురు కేంద్ర మంత్రులతో ఎంపీలు ఫోటో సెషన్ లో పాల్గొన్నారు. పార్లమెంట్ ఉభయ సభలకు చెందిన ఎంపీలు ఇవాళ ఉదయమే పార్లమెంట్ భవనం వద్దకు చేరుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం నుండి పార్లమెంట్ కొత్త భవనంలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో పాత పార్లమెంట్ భవనం వద్ద పార్లమెంట్ ఉభయ సభలకు చెందిన ఎంపీలు ఫోటో సెషన్ లో పాల్గొన్నారు. ఈ ఫోటో సెషన్ లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు పలు పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. పార్లమెంట్ కొత్త భవనాన్ని నోటిఫై చేస్తూ కేంద్రం ఇవాళ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఈ ఫోటో సెషన్ ముగిసిన తర్వాత ఇవాళ మధ్యాహ్నం నుండి కొత్త పార్లమెంట్ భవనంలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కొత్త పార్లమెంట్ భవనంలో మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. నిన్ననే కేంద్ర కేబినెట్ సమావేశం మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై పలు పార్టీలు హర్షం వ్యక్తం చేశాయి.
ఇదిలా ఉంటే ఫోటో సెషన్ తర్వాత పాత పార్లమెంట్ భవనంలోని సెంట్రల్ హల్ లో ఉదయం 11 గంటలకు ప్రత్యేక కార్యక్రమం సాగుతుంది. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత కొత్త పార్లమెంట్ భవనానికి మోడీ సహా ఎంపీలు చేరుకుంటారు. కొత్త గుర్తింపు కార్డులతో ఎంపీలంతా కొత్త పార్లమెంట్ భవనంలోకి ప్రవేశిస్తారు. ఇవాళ మధ్యాహ్నం 1:15 గంటలకు లోక్ సభ, 2:15 గంటలకు రాజ్య సభ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.పార్లమెంట్ సెంట్రల్ హల్ లో జరిగే కార్యక్రమంలో లోక్ సభలో ఎక్కువ కాలం ఎంపీలుగా కొనసాగిన ప్రముఖులు తమ అనుభవాలను పంచుకొనే అవకాశం ఉంది.పాత పార్లమెంట్ భవనం అనేక చారిత్రాత్మక సంఘటనలకు సాక్ష్యంగా నిలిచింది. 1927, జనవరి 18న అప్పటి వైస్రాయి లార్డ్ ఇర్విన్ ఈ భవనాన్ని ప్రారంభించారు.