Sonu Sood: సోనూ సూద్ ఇంటిపై ఐటీ దాడులు?.. ఆరు చోట్ల ‘సర్వే’ చేసిన అధికారులు

By telugu teamFirst Published Sep 15, 2021, 5:25 PM IST
Highlights

ప్రముఖ నటుడు, యాక్టివిస్ట్ సోనూ సూద్‌కు చెందిన ముంబయి నివాసం, కంపెనీ సహా ఆయనకు సంబంధించిన మొత్తం ఆరు ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు చేసినట్టు సమాచారం. ఆయన అకౌంటింగ్ బుక్‌లో కొన్ని ట్యాంపరింగ్‌లు కనిపించాయని, వాటికి సంబంధించే ఈ ‘సర్వే’ చేస్తున్నట్టు ఐటీవర్గాలు వెల్లడించాయి.

ముంబయి: కరోనా కల్లోల కాలంలో సహాయానికి మారు పేరుగా నిలిచిన యాక్టర్, యాక్టివిస్ట్ సోనూ సూద్ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేసినట్టు సమాచారం అందింది. ముంబయిలోని తన నివాసంలో ఆదాయ పన్ను అధికారులు సర్వే చేస్తున్నట్టు సంబంధితవర్గాలు తెలిపాయి. ముంబయిలోని తన నివాసంతోపాటు లక్నోలో తనకు సంబంధించిన ఓ కంపెనీ సహా మొత్తం ఆరు ప్రదేశాల్లో ఈ ఆపరేషన్స్ జరిగాయి. సోనూ సూద్‌కు చెందిన అకౌంట్ బుక్‌లో కొన్ని ట్యాంపరింగ్‌లకు సంబంధించి ఈ సర్వేలు జరిగినట్టు తెలిసింది.

కరోనా వైరస్ విలయం సృష్టించిన కాలంలో సహాయం అంటూ అర్థించిన వేలాది మందికి ఆయన ఆపన్నహస్తం అందించారు. తద్వారా దేశంలోనే ప్రత్యేక అభిమానులను సంపాదించుకున్నారు. వందలాది మందికి ఆదర్శంగా నిలిచారు. ఇటీవలే ఆయన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌తో భేటీ కావడం చర్చనీయాంశమైంది. బహుశా ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారన్న చర్చ ఊపందుకుంది. పంజాబ్ ఎన్నికల్లో ఆయన బరిలోకి దిగుతారనీ చర్చ మొదలైంది. కానీ, వీటన్నింటిని ఆయన కొట్టివేశారు. ఈ ఎన్నికలకు సంబంధించే ఆయనకు సంబంధించిన ఆస్తులపై ఐటీ సర్వేలు జరిగినట్టు కొన్నివర్గాలు తెలిపాయి.

అరవింద్ కేజ్రీవాల్‌తో ఆయన భేటీకి సంబంధించినదేమీ కాదని, అసలు ఇవి ఐటీ దాడులు కావని, సర్వే అని బీజేపీ ప్రతినిధి ఆసిఫ్ భమ్లా తెలిపారు. ముందస్తుగా లభించిన సూచనల మేరకు ఈ సర్వే జరుగుతున్నదని, ఈ సర్వే చేసినంత మాత్రానా సోనూ సూద్ తప్పు చేశాడని భావించనక్కరలేదని అన్నారు. ఐటీ శాఖ స్వతంత్రమైనదని, సర్వే చేయడానికి దానికి స్వయంగా నిబంధనలుంటాయని, ఇందులో రాజకీయ కోణాలేమీ లేవని చెప్పారు.

ఐటీ దాడులంటే ఎప్పుడైనా, ఎవరివద్దకైనా వెళ్లి దానికి సంబంధించిన డాక్యుమెంట్లు లేదా ఇతర వస్తువలను సీజ్ చేసే అధికారం ఐటీ శాఖకు ఉంటుంది. కానీ, దాడులతో పోలిస్తే సర్వే చాలా పరిమితమైనదని నిపుణులు చెబుతున్నారు.

click me!