అమరీందర్‌కు షాక్.. పంజాబ్ పీసీసీ చీఫ్‌గా సిద్ధూ, కీలక ప్రకటన చేసిన సోనియా

By Siva KodatiFirst Published Jul 18, 2021, 10:13 PM IST
Highlights

పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూని నియమిస్తూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశాలు జారీ చేశారు. అమరీందర్‌ సింగ్‌ అభ్యంతరాలను పక్కనపెడుతూ.. సిద్ధూకే పంజాబ్‌ పగ్గాలు అప్పగిస్తూ సోనియా నిర్ణయం తీసుకున్నారు. 

పంజాబ్‌ రాష్ట్ర రాజకీయాల్లో గత కొన్నాళ్లుగా నెలకొన్న ఉత్కంఠ వీడింది. ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి, మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ నియమితులయ్యారు. పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడిగా సిద్ధూని నియమిస్తున్నట్టు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదివారం రాత్రి ప్రకటించారు. సిద్ధూతో పాటు మరో నలుగురిని కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమిస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఉత్తర్వులు వెలువరించారు. ఆయన నియామకం ద్వారా ఎన్నికలకు 6 నెలల ముందు హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లయ్యింది. 

సిద్ధూకు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించే అంశంపై ఇటీవల తీవ్ర చర్చ జరిగింది. పార్టీ అధిష్ఠానం సుముఖంగా ఉన్నప్పటికీ   సీఎం అమరీందర్‌ సింగ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఓ లేఖను కూడా రాశారు. పంజాబ్ విషయంలో అధిష్టానం మితిమీరిన జోక్యం చేసుకుంటోందని సీనియర్లను విస్మరించారని లేఖలో దుయ్యబట్టారు. ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి పార్టీకి కష్టమేనని సీఎం తెగేసి చెప్పారు.

Also Read:పంజాబ్ కాంగ్రెస్‌లో ‘‘ పీసీసీ ’’ చిచ్చు: సిద్ధూకి పదవిపై అమరీందర్ సింగ్ అలక, రంగంలోకి హరీశ్ రావత్

ఈ నేపథ్యంలో కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమైంది. పంజాబ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ హరీశ్ రావత్ శనివారం సీఎంతో భేటీ అయ్యారు. దాదాపు 30 నిమిషాల పాటు ఈ భేటీ సాగినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత హరీశ్ రావత్ మాట్లాడుతూ.. పంజాబ్ విషయంలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి సీఎం అమరీందర్ కట్టుబడే వుంటారని పేర్కొన్నారు. సోనియా నిర్ణయానికి తాను కట్టుబడే వుంటానని సీఎం తనతో అన్నారని హరీశ్ రావత్ వెల్లడించారు. కానీ, అమరీందర్‌ సింగ్‌ అభ్యంతరాలను పక్కనపెడుతూ.. సిద్ధూకే పంజాబ్‌ పగ్గాలు అప్పగిస్తూ సోనియా నిర్ణయం తీసుకున్నారు. 

click me!