
స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తికావస్తున్న సమయంలోనూ రాజద్రోహ చట్టాన్నికొనసాగించడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో గడిచిన ఆరేళ్లలో దేశవ్యాప్తంగా 326 రాజద్రోహం కేసులు నమోదైనట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. వీటిలో అత్యధికంగా అస్సాంలోనే 54 కేసులు నమోదయ్యాయి. ఇన్ని కేసులు నమోదైనప్పటికీ.. కేవలం ఆరు కేసుల్లోనే శిక్ష ఖరారైందని హోంశాఖ నివేదిక పేర్కొంది.
2014 -2019 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా రాజద్రోహం చట్టం కింద 326 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ 141 కేసుల్లోనే ఛార్జిషీట్ దాఖలు చేశారు. మొత్తం కేసుల్లో 54 కేసులు అస్సాంలోనే నమోదుకాగా వీటిలో 26 కేసుల్లో ఛార్జిషీట్ సమర్పించారు. వీటిలో 25 కేసుల్లో విచారణ పూర్తయినప్పటికీ ఏ ఒక్కరు దోషిగా తేలకపోవడం గమనార్హం.
ALso Read:‘దేశద్రోహ చట్టం’పై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. !
అస్సాంత తర్వాత ఝార్ఖండ్‌లో 40 కేసులు, హర్యానా 31, బిహార్, జమ్మూ కశ్మీర్, కేరళ రాష్ట్రాల్లో 25 చొప్పున రాజద్రోహ కేసులు నమోదయ్యాయి. అలాగే కర్ణాటకలో 22, ఉత్తర్‌ప్రదేశ్ 17, పశ్చిమబెంగాల్‌లో ఎనిమిది, ఢిల్లీలో నాలుగు, మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. ఇక సంవత్సరాల వారీగా చూస్తే ఒక్క 2019లోనే 93 కేసులు నమోదవ్వగా... 2015లో అత్యల్పంగా 30, 2016లో 35, 2017లో 51, 2018లో 70 చొప్పున రాజద్రోహ కేసులు నమోదయ్యాయి. 2020 నాటి సమాచారాన్ని కేంద్ర హోంశాఖ ఇంకా వెలువరించలేదు.