సియాచెన్‌లో మంచుతుఫాన్‌లో కనిపించకుండా పోయిన జవాన్.. 38 ఏళ్ల తర్వాత మృతదేహం లభ్యం

By Mahesh KFirst Published Aug 15, 2022, 8:23 PM IST
Highlights

సియాచెన్‌లో గస్తీ కాస్తుండగా మంచుతుఫాన్‌తో కనిపించకుండా పోయిన జవాన్ 38 ఏళ్ల తర్వాత విగతజీవై కనిపించాడు. 1984లో తుఫాన్‌లో కనిపించకుండా పోయిన చంద్రశేఖర్ హర్బొలా.. పాత బంకర్‌లో మృతదేహం రూపంలో కనిపించాడు.

న్యూఢిల్లీ: ఆపరేషన్ మేఘదూత్‌లో భాగంగా 1984లో ప్రపంచంలోనే ఎత్తైన ప్రాంతం సియాచెన్‌లో భారత సైనికులు గస్తీ కాశారు. ఓ సారి ఇలాగే 20 మంది ట్రూపులు గస్తీ కాస్తుండగా మంచు తుఫాన్ ముంచుకొచ్చింది. దీంతో ఆ  పెట్రోలింగ్ టీమ్ మంచు తుఫాన్‌లో చిక్కుకుపోయింది. వారి ఒక్కొక్కరు ఒక్కోచోట పడిపోయారు. ఈ తుఫాన్ తర్వాత 15 మంది జవాన్ల మృతదేహాలు లభించాయి. కానీ, ఐదుగురి డెడ్ బాడీలు మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు దొరకలేదు. తాజాగా, ఒకరి డెడ్ బాడీ సియాచెన్‌లోని ఓల్డ్ బంకర్‌లో లభించింది. అంటే 38 సంవత్సరాల తర్వాత ఆ సైనికుడి మృతదేహం లభించింది.

రానిఖేత్‌లోని సైనిక్ గ్రూప్ సెంటర్ ఆదివారం ఈ డెడ్ బాడీని గుర్తించింది. 19 కుమావోన్ రెజిమెంట్‌కు చెందిన చంద్రశేఖర్ హర్బొలాగా ఆ డెడ్ బాడీని ధ్రువీకరించింది. ఆపరేషన్ మేఘదూత్‌లో భాగంగా పహారా కాయడానికి వెళ్లిన 20 మందిలో చంద్రశేఖర్ హర్బొలా కూడా ఉన్నారు. 

ఆయన భార్య శాంతి దేవి అల్మోరాకు చెందినావిడ. కానీ, ప్రస్తుతం హల్ద్వానిలో ఉంటున్నారు. సరస్వతి విహార్ కాలనీలో ఆమె నివసిస్తున్నారు. చంద్రశేఖఱ్ హర్బొలా డెడ్ బాడీని సోమవారం సాయంత్రానికల్లా అక్కడకు చేర్చే ఏర్పాట్లలో ఉన్నట్టు అధికారులు బాడీ లభించిన తర్వాత వెల్లడించారు. హల్ద్వాని సబ్ కలెక్టర్ మనీష్ కుమార్, తహశీల్దార్ సంజయ్ కుమార్‌లు హర్బొలా ఇంటికి వెళ్లారు. మిలిటరీ గౌరవాలతోనే హర్బొలా అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు.

శాంతి దేవి, చంద్రశేఖర్ హర్బొలా పెళ్లి చేసుకుని 9 ఏళ్లు కలిసి ఉన్నారని తెలిపారు. వారికి ఇద్దరు ఆడపిల్లలు అని శాంతి దేవి వివరించారు. హర్బొలా చివరి సారి 1984 జనవరిలో ఇంటికి వచ్చారని వివరించారు. ఆ సమయంలోనే తాను త్వరలోనే తిరిగి ఇంటికి వస్తానని తనకు వాగ్దానం చేశాడని ఆమె తెలిపింది. కుటుంబానికి ఇచ్చిన మాట నిలబెట్టకున్నా.. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన తన భర్త గొప్పవాడని వివరించింది.

హర్బొలాతోపాటు మరో జవాను మృతదేహం కూడా లభించినట్టు తెలిసింది. అయితే, ఆ మృతదేహాన్ని ఇంకా గుర్తించలేదని సమాచారం.

click me!