తాగుబోతును రెండుసార్లు కరిచిన పాము.. చివరికి అదే చచ్చింది.. !!

Published : Oct 14, 2022, 10:11 AM IST
తాగుబోతును రెండుసార్లు కరిచిన పాము.. చివరికి అదే చచ్చింది.. !!

సారాంశం

ఓ వ్యక్తిని పాము రెండు సార్లు కాటేసింది. అయితే, ట్విస్ట్ ఏంటంటే ఆ పామే చచ్చి ఊరుకుంది. కారణమేంటో తెలియక డాక్టర్లు తలలు పట్టుకున్నారు. 

లక్నో : పాము... అది ఒట్టి బురదపామైనా సరే..  అడుగు దూరంలో కనిపిస్తే.. భయంతో పరుగులు పెడతాం. ఇక నాగుపాము కనిపిస్తే.. చూడగానే భయంతో సగం చస్తాం.. ఇక అదికాటేస్తే ఇంకేమైనా ఉందా… 15-20 సెకన్లలో విషం కంటే ముందు భయంతోనే ప్రాణాలు పోవడం ఖాయం. కానీ, ఓ తాగుబోతు మాత్రం నాగుపాము తనను రెండు సార్లు కాటేసి.. అదే చచ్చిపోయింది అంటూ ఆస్పత్రికి పరుగెత్తుకు వచ్చాడు. అంతే కాదు, ఒక పాలిథిన్ కవర్లో చచ్చిపోయిన నాగుపామును పెట్టుకుని మరీ వెంట తీసుకొచ్చాడు.  

యూపీలోని ఖుషినగర్ ఆస్పత్రిలో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. కవర్లో కింగ్ కోబ్రా కళేబరంతో వచ్చాడు ఓ వ్యక్తి. తన పాదం మీద రెండు చోట్ల ఆ పాము కరిచిందని ఆ వ్యక్తి చెప్పాడు.  అంతేకాదు తనకు ఏదైనా వ్యాక్సిన్ ఇవ్వమని వైద్యులను అడిగాడు. దీంతో మనిషిని కరిచి పాము చనిపోవడం ఏంటో అర్థం కాక డాక్టర్లు నోరెళ్లబెట్టారు.

ఉప్పల్ లో దారుణం.. దుండగుల చేతిలో తండ్రీకొడుకు హతం.. (వీడియో)

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే సెప్టెంబర్ 8న ఒడిశాలో వెలుగు చూసింది. మనిషి  పాము మీద పగపట్టాడు. మీరు విన్నది నిజమే..  పాము మనిషి మీద పగపట్టడం గురించి కాదు… మనిషి పాము మీద పగ పట్టడం గురించి ఈ స్టోరీ. మనిషి పామును కరవడంతో అది మృతి చెందింది. ఇదేదో ఫిక్షనల్ కథ కాదు. అచ్చమైన నిజ జీవిత వాస్తవం. ఒడిశాలోని బలేశ్వర్ జిల్లా దొరొడా గ్రామంలో ఈ ఆశ్చర్యకర సంఘటన చోటుచేసుకుంది. బోలా శంకరుడి తరహాలో కాటేసి.. చంపేసిన పామును మెడలో వేసుకుని ఊరంతా తిరిగాడు ఓ ప్రబుద్ధుడు. మనసునిండా ఉక్రోషంతో పాము మీద పగ తీర్చుకున్నాడు. 

వివరాల్లోకి వెళితే.. బాలేశ్వర్ జిల్లా దొరొడా గ్రామానికి చెందిన సలీం నాయక్ తన పొలంలో పనిచేసుకుంటున్నాడు. ఈ క్రమంలో అతని కాలిపై నాగుపాము కాటేసింది. అది చూసి అతను భయపడలేదు కోపంతో, ఉక్రోషంతో ఉడికిపోయాడు. తనను కాటేసి అక్కడినుంచి పారిపోతున్న సర్పాన్ని వెంబడించి పట్టుకున్నాడు. దాన్ని తానే కాటేసి చంపాలనుకున్నాడు. అంతే.. పామును ఒడిసి పట్టుకుని.. పాము తల, తోకలను గట్టిగా పట్టుకుని మిగిలిన భాగం అంతా ఇష్టం వచ్చినట్టు.. ఎక్కడ పడితే అక్కడ కసిగా కొరికేశాడు. పాము తోలు ఊడిపోయి.. మాంసం బయటపడేంత వరకు పట్టు వదలకుండా కొరికాడు. అప్పటికి గానీ అతను శాంతించలేదు. 

బాధ తట్టుకోలేని పాము.. తన నోటితో తానే కాటేసుకునేలా చేశాడు. ఆ తరువాత చనిపోయిన సర్పాన్ని మెడకు చుట్టుకుని.. ఊరంతా ఊరేగాడు. ఇది చూసిన వారు.. పామును చూసినదానికంటే సలీం నాయక్ ను చూసి ఎక్కువగా భయపడ్డారు. నోటమాట రాకుండా నివ్వెరపోయారు. అయితే, పామును చంపేసిన అతను.. అంతకుముందు తనను కాటేసిన పాము కాటుకు మాత్రం ఎలాంటి వైద్యం చేయించుకోలేదు. తనకు పాము మంత్రం తెలుసని, తాను తాంత్రికుడినని, చికిత్స, వైద్యం నిరాకరించాడు. సంప్రదాయం ప్రకారం చంపిన పామును దహనం చేయకుండా.. ఖననం చేస్తున్నట్లు వివరించాడు. కాగా, ఈ ఘటన మీద వన్యప్రాణుల సంరక్షణ వర్గాలు స్పందించకపోవడం గమనార్హం. 

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu