భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా అమేథీకి వచ్చిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.. అమేథీ లోక్‌సభ స్థానం నుంచి మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయాలని రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) బహిరంగ సవాల్ విసిరారు. లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీ (Amethi) నుంచి మరోసారి పోటీకి దిగాలని అన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రను ఫ్లాప్ షోగా అభివర్ణించిన ఆమె.. రాహుల్ యాత్రలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పాల్గొనలేదని పేర్కొన్నారు. తన పార్లమెంటరీ నియోజకవర్గం అమేథీలో నాలుగు రోజుల పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ విలేకరులతో మాట్లాడుతూ రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు.
రాహుల్ గాంధీ సోమవారం అమేథీ పర్యటిస్తున్నారనీ, కానీ, కాంగ్రెస్ మాజీ అధినేతకు నిర్మానుష్య వీధులు స్వాగతం పలికాయంటూ ఎద్దేవా చేశారు. దీనికి ప్రధాన కారణం అతను అమేథీని అధికార కేంద్రంగా భావించాడు, కానీ, ఇక్కడి ప్రజలకు ఎలాంటి సేవ చేయలేదు. అందుకే అమేథీలోని నిర్మానుష్య వీధులు ఆయనకు స్వాగతం పలుకుతున్నాయని అన్నారు. రాహుల్ గాంధీ పర్యటనలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పాల్గొనలేదనీ, అందుకే.. సుల్తాన్‌పూర్, ప్రతాప్‌గఢ్ నుంచి కాంగ్రెస్ కార్యకర్తలను పిలవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అమేథీ నుంచి రాహుల్‌ను ఓడించిన ఇరానీ.. అమేథీ స్థానం నుంచి మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయాలని రాహుల్ గాంధీకి సవాలు విసిరారు.
undefined
2004 నుంచి 2019 వరకు అమేథీ నుంచి ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీపై 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఇరానీ విజయం సాధించారు. అయోధ్యలో రామ్ లల్లా దీక్షా కార్యక్రమానికి కాంగ్రెస్ అధిష్టానం హాజరయ్యేందుకు నిరాకరించడంపై రాహుల్‌ను ఉద్దేశించి ఇరానీ మాట్లాడుతూ.. రామ్‌లల్లా (అయోధ్యలో ప్రతిష్ఠాపన కార్యక్రమం) ఆహ్వానాన్ని తిరస్కరించిన వ్యక్తులే వీరేనని అన్నారు. దీంతో అమేథీ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ రోజు రాహుల్ గాంధీ అమేథీకి వచ్చినా ఇక్కడి ప్రజల మద్దతు లభించకపోవడానికి కారణం ఇదేనని విమర్శించారు.
రాయ్‌బరేలీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయనని, రాజ్యసభకు వెళ్లనని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రకటనను ఎత్తి చూపుతూ.. కేంద్ర మంత్రి విమర్శలు గుప్పించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో గాంధీ కుటుంబాన్ని అమేథీ ప్రజలు అక్కడి నుంచి పంపించివేశారని అన్నారు. ఇప్పుడూ (2024లో) రాయ్‌బరేలీ ప్రజలు కూడా సాగనంపుతారని విమర్శించారు.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు అమేథీలో కేవలం రూ.500 కోట్లు మాత్రమే పెట్టుబడి పెట్టారు.కానీ.. గత 10 ఏళ్లలో బీజేపీ హయంలో ఈ ప్రాంతానికి రూ.6552 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 20 వేల మందికి ఉద్యోగాలు కూడా లభించాయని ఇరానీ పేర్కొన్నారు. యాదృచ్ఛికంగా.. ఒకే సమయంలో ఈ ఇద్దరు నేతలు స్థానికంగా పర్యటిస్తుండటం ఐదేళ్లలో ఇది రెండోసారి.