రైతు సంఘాల ఆందోళన: ఎంఎస్‌పీ ప్రతిపాదనకు ఎస్‌కెఎం తిరస్కరణ

By narsimha lode  |  First Published Feb 19, 2024, 9:33 PM IST

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన  అంశాలను రైతు సంఘం నేతలు  తిరస్కరిస్తున్నారు.  


న్యూఢిల్లీ:  తమ డిమాండ్ల సాధన కోసం  రైతు సంఘాల నేతలతో  కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతుంది. ఆదివారం నాడు రాత్రి నాలుగో విడత చర్చలు కూడ ముగిశాయి.  ఈ చర్చలు కూడ ఫలప్రదం కాలేదు. మరో వైపు  కేంద్ర ప్రభుత్వం  ప్రకటించిన ఐదేళ్ల పాటు ఎంఎస్‌పీ కాంట్రాక్ట్ ఆఫర్ ను  సంయుక్త కిసాన్ మోర్చా తిరస్కరించింది. 

ఆదివారం నాడు అర్థరాత్రి రైతు నాయకులతో  కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్,  అర్జున్ ముండా,  నిత్యానంద్ రాయ్ లు సమావేశమయ్యారు.పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తిని రైతుల నుండి కనీస మద్దతు ధరలకు కొనుగోలు చేస్తామని మంత్రులు ప్రతిపాదించారు.  అయితే  సంయుక్త కిసాన్ మోర్చా  కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై విమర్శలు చేసింది.  రైతుల డిమాండ్లను పక్కదారి పట్టించేలా  కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన ఉందని  సంయుక్త కిసాన్ మోర్చా  అభిప్రాయపడింది. 23 రకాల పంటలకు ఎంఎస్‌పీ ధరకు కొనుగోలు చేయాలని  రైతు సంఘం నేతలు కోరారు. 2014 ఎన్నికల ముందు ఈ విషయాన్ని తన ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ పేర్కొందని సంయుక్త కిసాన్ మోర్చా నేతలు అభిప్రాయపడినట్టుగా ఎన్‌డీటీవీ కథనం తెలుపుతుంది.

Latest Videos

పంటల సేకరణలో సీ2+50% ఎంఎస్‌పీతో పాటు స్వామినాథన్ కమిషన్ ఫార్మూలాను అమలు చేయాలని కోరుతున్నారు.  ప్రస్తుతం పాటిస్తున్న ఏ2+ఎఫ్ఎల్+50% వద్దని సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది. నాలుగు విడుతలుగా కేంద్రం నిర్వహించిన చర్చల్లో పారదర్శకత లోపించిందని  రైతు సంఘం నేతలు ఆరోపించారు.

ఆదివారం నాడు రాత్రి కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదించిన అంశాలపై  రెండు రోజుల్లో  చర్చించి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నారు.ఎంఎస్‌పీ చట్టం, స్వామినాథన్ సిఫారసులు, రుణమాఫీ వంటి అంశాలపై చర్చించినట్టుగా రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లెవాల్ పేర్కొన్నారు.

ఈ నెల  19, 20 తేదీల్లో తమ ఫోరంలో చర్చించి దీనిపై నిపుణుల అభిప్రాయాన్ని తీసుకుంటామన్నారు. ఇందుకు అనుగుణంగా  తమ నిర్ణయాలు ఉంటాయని మరో రైతు నాయకుడు  సర్వన్ సింగ్ పంధేర్ చెప్పారు.పంజాబ్-హర్యానా సరిహద్దులో క్యాంప్ చేస్తున్న రైతుల నిరసనల మధ్యే ఈ చర్చలు జరిగాయి. 

click me!