
ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ భారతదేశంలో ఈ ఏడాది ఏ మేరకు వర్షాలు పడతాయో అనేదానిపై ఓ అంచనాను విడుదల చేసింది. 2023లో భారత్‌లో సాధారణం కంటే తక్కువ రుతుపవన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఎల్-నినో ప్రభావం పెరిగే అవకాశం ఉందని.. ఇది సాధారణంగా ఆసియాకు పొడి వాతావరణాన్ని తెస్తుందని తెలిపింది. లా నినా ముగిసిన తర్వాత ఇప్పుడు ఎల్ నినో రానున్న రోజుల్లో ఢీకొనబోతోందని.. దీని కారణంగా రుతుపవనాలు బలహీనంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది.
‘‘ఎల్ నినో సంభావ్యత పెరుగుతోంది. రుతుపవనాల సమయంలో దాని సంభావ్యత ఎక్కువగా పెరుగుతోంది. ఎల్ నినో తిరిగి రావడం బలహీనమైన రుతుపవనాలను సూచించవచ్చు’’ అని స్కైమెట్ మేనేజింగ్ డైరెక్టర్ జతిన్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. భారతదేశంలో రుతుపవనాల వర్షపాతం దీర్ఘకాలిక సగటులో 94 శాతం ఉంటుందని స్కైమెట్ పేర్కొంది. ఇక, నీటిపారుదల సౌకర్యం లేని భారతదేశంలోని దాదాపు సగం వ్యవసాయ భూమి వరి, మొక్కజొన్న, చెరకు, పత్తి, సోయాబీన్స్ వంటి పంటలను పండించడానికి వార్షిక జూన్-సెప్టెంబర్ వర్షాలపై ఆధారపడి ఉంటుంది.
ఇక, అకాల వర్షాలు, వడగళ్ల వానలు భారతదేశం సారవంతమైన ఉత్తర, మధ్య, పశ్చిమ మైదానాలలో శీతాకాలంలో పండించిన గోధమ వంటి పంటలను దెబ్బతీశాయి. దీంతో వేలాది మంది రైతులు నష్టాలకు గురయ్యారు. ఇదిలా ఉంటే.. ప్రభుత్వ ఆధ్వర్యంలోని భారత వాతావరణ శాఖ తన వార్షిక రుతుపవనాల సూచనను త్వరలో ప్రకటించనుంది.