Beard: రోజురోజుకు ట్రెండ్ మారుతోంది. ప్రస్తుతం గడ్డం పెంచడం ఒక ట్రెండ్ గా మారింది. యూత్ స్టైలిష్ గా గడ్డం పెంచడానికి ఇష్టపడుతున్నారు. వారి అభిమాన హీరోలు, స్టార్ క్రికెటర్లు సెలబ్రిటీలను చూసి వారిలాగా కొత్త లుక్ లో కొత్తగా కనిపించాలని కోరుకుంటున్నారు. అదే గతంలో అబ్బాయిలు గడ్డం పెంచితే.. లవ్ లో ఫెయిల్ అయ్యావా? అంటూ ప్రశ్నించేవారు. కానీ .. ఇప్పుడు లూక్ బాగుంది బాస్ అంటున్నారు. పైగా ఇప్పటి అమ్మాయిలు గడ్డం వున్న మగాళ్లని ఎక్కువగా ఇష్టపడుతున్నారట. దీంతో గడ్డం మరింత ఫ్యాషన్ గా అయింది . కానీ, ఓ అక్కడ మాత్రం యువకులు ఎవరైనా గడ్డంతో కనిపిస్తే చాలు.. వారికి భారీ ఫైన్ కట్టాల్సిందే.. ఇది ఎక్కడో తెలుసా ?
వివరాల్లోకెళ్తే.. ఉత్తర గుజరాత్ అంజనా చౌదరి సమాజ్ విచిత్రమైన ఉత్తర్వు జారీ చేసింది. యువకులు గడ్డం పెంచుకోవడాన్ని నిషేధించింది. ఒక వేళ గడ్డం పెంచుకుంటే.. రూ.51 వేల జరిమానా విధిస్తామని ఆదేశించింది అంజనా చౌదరి సమాజం. ఇటీవల బనస్కాంతలోని ధనేరాలో జరిగిన సమావేశంలో అంజనా చౌదరి సమాజ్ పలు సంచలన నిర్ణయాలను తీసుకుంది. సమాజం పట్ల సామాజిక సంస్కరణ కోసం మొత్తం 22 నిర్ణయాలను తీసుకుంది. వీటిలో ఫ్యాషన్ గడ్డంపై నిషేధం విధించారు ఆ కుల పెద్దలు. అంతే కాకుండా పెళ్లిళ్లలో ఖర్చు తగ్గించాలని, పెళ్లిళ్లలో డీజే, పార్టీ కల్చర్‌ను నిషేధించాలని అంజనా సమాజ్ తీర్మానం చేసుకుంది. ఉత్తర గుజరాత్‌లో అంజనా సమాజ్ చాలా శక్తివంతమైనది. సంఘసంస్కరణకు ఈ విషయాలు అవసరమని సంఘ నాయకులు అంటున్నారు.
54 గ్రామాల్లో నిబంధనలు
అంజనా చౌదరి సమాజ్ ఈ ప్రాంతంలోని 54 గ్రామాలకు ఈ 22 నిబంధనలను ప్రకటించింది. దీంతో సామాజిక మార్పు వస్తుందని సమాజ పెద్దలు అంటున్నారు. ఇందులో యువత ఫ్యాషనబుల్ గడ్డం పెట్టుకోవద్దని ఆదేశించారు. నిబంధనలు పాటించని పక్షంలో రూ.51 వేలు జరిమానా వసూలు చేసేలా నిబంధన పెట్టారు.
అంతే కాకుండా చనిపోయిన తర్వాత నల్లమందు తాగే సంప్రదాయానికి స్వస్తి పలకాలని సమాజం కోరింది. అలా చేయనందుకు రూ.లక్ష రికవరీ చేయాలని చెప్పారు. దీంతోపాటు వివాహాలకు సంబంధించిన ఆహ్వానపత్రికలు సాదాసీదాగా ఉండాలని అంజనా చౌదరి సమాజ్ ప్రకటనలో పేర్కొంది. పెళ్లిళ్లలో క్రాకర్స్ పేల్చకూడదనీ,పెళ్లిళ్లలో పౌష్టికాహారం అందించాలని కోరారు. ఇది మాత్రమే కాదు, ఈ ఆహారాన్ని అందించడానికి స్థానిక యువకులు ఉండాలి. ఆహారాన్ని వండడానికి , వడ్డించడానికి క్యాటరింగ్‌లను పిలవడం కూడా నిషేధించారు.
కూతుళ్ల బేబీ షవర్‌లో రూ.51,000 కంటే ఎక్కువ ఇవ్వకూడదని అంజనా చౌదరి సమాజ్ తెలిపింది. పెళ్లిళ్లలో డీజేపై నిషేధం విధించడంతో అతిథులు, బంధువులు శాలువా, తలపాగాతో స్వాగతం పలకాలని సూచించారు. ఇది కాకుండా, సోదరీమణులు మరణిస్తే ఆర్థిక లావాదేవీలు నిలిపివేశారు. ఇంటి సభ్యులెవరూ చనిపోయినా పెద్దగా అవమానాలు ఉండకూడదని సమాజం పక్షాన చెప్పుకొచ్చారు. దాని స్థానంలో ఒక చిన్న కార్యక్రమం చేయాలి. మరణానంతరం దీపం వెలిగించేందుకు కూడా బంధువులందరినీ పిలవాల్సిన అవసరం లేదని సూచించారు.