గణేశ్ నిమజ్జనం చేస్తుండగా దుర్ఘటన.. నీటిలో మునిగి ఏడుగురు దుర్మరణం.. సీఎం సంతాపం

By Mahesh KFirst Published Sep 10, 2022, 4:02 AM IST
Highlights

హర్యానాలో గణేశుడి నిమజ్జనం చేస్తుండగా ఏడుగురు నీట మునిగి చనిపోయారు. మహేందర్ గడ్‌లో నలుగురు, సోనిపాట్‌లో ముగ్గురు మరణించారు. ఈ ఘటనలపై సీఎం మనోహర్ లాల్ ఖట్టార్ స్పందించి మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. 

న్యూఢిల్లీ: గణేశ్ నవరాత్రులు ముగిశాయి. తొమ్మిది రాత్రులు పూర్తయిన తర్వాత వినాయకుడి నిమజ్జనాలు శుక్రవారం ఎక్కువగా జరిగాయి. హర్యానాలో ఈ నిమజ్జనం సందర్భంగా జరిగిన ఘటనలు కొన్ని కుటుంబాల్లో విషాదం నింపాయి. హర్యానాలోని మహేందర్‌గడ్‌, సోనిపాట్ జిల్లాల్లో వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా ప్రమాదవశాత్తు ఏడుగురు నీట మునిగి చనిపోయారు.

మహేందర్ గడ్ జిల్లాలోని కనీనా రెవారీ రోడ్డు దగ్గర ఝగదోలి గ్రామ సమీపంలోని కెనాల్‌లో తొమ్మిది అడుగుల వినాయకుడిని నిమజ్జనం చేయడానికి వెళ్లారు. అయితే, ఆ కెనాల్‌లో నీటి ప్రవాహం ఉధృతంగా ఉన్నది. దీంతో నిమజ్జనం చేస్తుండగా తొమ్మిది
మంది యువకులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. జిల్లా అధికారులు వెంటనే ఎన్‌డీఆర్ఎఫ్ సహాయం తీసుకుంది. రెస్క్యూ ఆపరేషన్‌లో దిగింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా రెస్క్యూ సిబ్బంది ఎనిమిది మందిని నీటి నుంచి కాపాడగలిగారు. అందులో నలుగురు మరణించారు. మిగతా వారిని పట్టుకుని హాస్పిటల్‌లో చికిత్స కోసం తరలించింది.

కాగా, సోనిపాట్‌లో యమునా నదిలో గణేశ్ నిమజ్జనంతో ముగ్గురు నీట మునిగిపోయారు. సోనిపాట్ మిమర్‌పూర్ ఘాట్ దగ్గర గణేశుడి నిమజ్జనం కోసం వెళ్లిన ఓ వ్యక్తి, తన కొడుకు, అల్లుడు ముగ్గురూ నీట మునిగారు. ఆ ముగ్గురూ మరణించినట్టు పోలీసులు తెలిపారు. వారి డెడ్ బాడీలను పోస్టుమార్టం కోసం పంపించారు. ఘటనపై దర్యాప్తు మొదలు పెట్టినట్టు వివరించారు.

 మహేందర్ గడ్‌కు సంబంధించిన ఘటనలో నలుగురు యువకులను హాస్పిటల్‌కు చేర్చేలోపు అప్పటికే మరణించారని సివిల్ సర్జన్ డాక్టర్ అశోక్ కుమార్ తెలిపారు.

ఈ ఘటనపై సీఎం మనోహర్ లాల్ ఖట్టార్ స్పందించారు. మహేందర్ గడ్, సోనిపాట్ జిల్లాల్లో గణేశుడి నిమజ్జనం సందర్భంగా నీటిలో ముగిని ఆరుగురి అకాల మరణాలు గుండెను పిండేస్తున్నాయని తెలిపారు. ఈ దుస్సమయంలో మరణించిన వారి కుటుంబాలకు అండగా అందరూ నిలబడాలని సూచించారు. చాలా మందిని మృత్యువు అంచుల నుంచి ఎన్‌డీఆర్ఎఫ్ బృందం కాపాడగలిగిందని వివరించారు. వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేశారు.

click me!