కశ్మీర్ సమస్య పరిష్కారానికి ఐఐటీ గ్రాడ్యుయేట్ పిటిషన్.. రూ. 50వేల ఫైన్ వేసిన సుప్రీంకోర్టు

By Mahesh KFirst Published Sep 9, 2022, 11:40 PM IST
Highlights

కశ్మీర్ సమస్యకు సరైన పరిష్కారం ముషారఫ్, మన్మోహన్ సింగ్ ఒప్పందమే ఇవ్వగలదని ఐఐటీ బాంబే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు సమయం వృథా చేశారని పిటిషనర్‌పై రూ. 50 వేల జరిమానాను ద్విసభ్య ధర్మాసనం విధించింది.

న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మధ్య రావణకాష్టంలా ఎప్పుడూ మండుతున్న సమస్య కశ్మీర్. జమ్ము కశ్మీర్ కోసం ఈ రెండు దేశాల మధ్య యుద్ధాలు కూడా జరిగాయి. అంతేకాదు, సరిహద్దు గుండా తరుచూ నిబంధనలు అతిక్రమిస్తూ కాల్పులు జరపడం.. భారత జవాన్లు మరణించిన ఘటనలు నిన్న మొన్నటి వరకు చూశాం. అలాంటి సమస్యకు సొల్యూషన్‌ను సూచిస్తూ ఐఐటీ బాంబే గ్రాడ్యుయేట్ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ వేశారు. ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యంలా లేదని, ప్రచార ప్రయోజన వ్యాజ్యంలా ఉన్నదని సుప్రీంకోర్టు మండిపడింది. రూ. 50వేల ఫైన్ వేసింది. 

ఐఐటీ బాంబే గ్రాడ్యుయేట్ ప్రభాకర్ వెంకటేశ్ దేశ్‌పాండే సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ వేశాడు. ఇందులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్‌లు రూపొందించిన ఫార్ములాను ప్రస్తావించారు. అటానమీ, జాయింట్ కంట్రోల్, డీమిలిటరైజేషన్ వంటి అంశాలు ఆ ఫార్ములాలో ఉన్నాయి. వీటిని మరింత చర్చించి విజయవంతంగా సమస్యను పరిష్కరించవచ్చనే అభిప్రాయాన్ని పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ ఫార్ములాను ఎంచుకుని కశ్మీర్ సమస్యను పరిష్కరించేలా ఆదేశాలు వెలువరించాలని సుప్రీంకోర్టును కోరాడు.

ఈ పిటిషన్ న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, హిమా కోహ్లీ ధర్మాసనం ముందుకు వచ్చింది. విధాన పరమైన విభాగంలోకి న్యాయస్థానం వెళ్లదని, ఈ పిటిషన్ కేవలం ప్రచారమే లక్ష్యంగా వేసినట్టు కనిపిస్తున్నదని బెంచ్ పేర్కొంది. ఇలాంటి పిటిషన్లతో కోర్టు సమయం వృథా చేస్తున్న కౌన్సెల్‌ను నోటీసులో పెడుతున్నామని కోర్టు వివరించింది. ఈ పిటిషన్ వింటామని, కానీ, కౌన్సెల్‌ను నోటీసులో పెడుతున్నామని, ఆయనకు జరిమానా వేస్తామని ముందుగానే బెంచ్ వార్నింగ్ ఇచ్చింది.

పిటిషనర్ తరఫున అడ్వకేట్ అరూప్ బెనర్జీ వాదిస్తూ కశ్మీర్ విషయమై పాకిస్తాన్‌పై భారత్ రెండున్నర యుద్ధాలు చేసిందని అన్నారు. గడిచిన 70 ఏళ్లలో ఈ సమస్యకు ఇప్పటి వరకూ పరిష్కారం లభించలేదని వివరించారు.

ఈ విషయమై తమ పిటిషనర్‌ ఇన్‌స్టంట్‌గా పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ దాఖలు చేయాలని భావిస్తున్నాడని వివరించారు. ముషారఫ్, మన్మోహన్ సింగ్ అకార్డ్ కశ్మీర్ సమస్యకు పరిష్కారం ఇస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. కొన్ని నిమిషాలు ఆయన వాదనలు విన్న ధర్మాసనం.. తాము ఈ పిటిషన్‌ను విచారించాలని అనుకోవడం లేదని స్పష్టం చేసింది. పిటిషనర్‌పై రూ. 50వేల జరిమానాను విధించింది.

click me!