కొండ దిగుతూ ఇంటిపై పడిన బస్సు: ఆరుగురి దుర్మరణం

By Siva KodatiFirst Published Jan 3, 2021, 6:01 PM IST
Highlights

కేరళలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. 

కేరళలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. కాసర్‌గోడ్‌ సమీపంలో పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ఓ బస్సు ఎత్తయిన ప్రాంతం నుంచి దిగే క్రమంలో అదుపుతప్పి పక్కనే ఉన్న ఓ ఇంటి పై పడింది.

ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడ మరణించగా, పలువురికి తీవ్ర గాయాల పాలయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. వీరంతా  కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.   

సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాల్ని పూదమకల్లు తాలుకా ఆస్పత్రికి తరలించారు. మృతులను శ్రేయస్‌ (13), రవిచంద్ర (40), జయలక్ష్మీ(39), రాజేష్(45), సుమతిలుగా గుర్తించారు.

ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ముగ్గురిని మంగళూరు ఆస్పత్రికి, ఇతర క్షతగాత్రుల్ని దగ్గరలోని ఇతర ఆస్పత్రులకు తరలించారు. బస్సులో ప్రయాణిస్తున్న వారంతా పెళ్లికూతురు తరపు వారే కావడం గమనార్హం.

వీరంతా సూలియా ప్రాంతం నుంచి పనత్తూరు ఎల్లుకొచ్చికి ప్రయాణిస్తుండగా ఘటన చోటుచేసుకుంది. బస్సు పడిన ఇల్లు జోస్‌ అనే వ్యక్తికి చెందింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది.

కాగా ఈ ఘటనపై కేరళ సీఎం పినరయి విజయన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించిన ముఖ్యమంత్రి, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.
 

click me!