రేణుక ఎల్లమ్మ ఆలయానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. బొలెరో రూపంలో మృత్యువు.. ఆరుగురు దుర్మరణం..

By Sumanth KanukulaFirst Published Jan 5, 2023, 11:42 AM IST
Highlights

కర్ణాటకలోని బెలగావి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బెలగావి జిల్లాలోని రామదుర్గ తాలుకా చుంచనూర్ వద్ద గురువారం తెల్లవారుజామున బొలెరో పికప్ వాహనం అదుపుతప్పి  చెట్టును ఢీకొట్టింది.

కర్ణాటకలోని బెలగావి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బెలగావి జిల్లాలోని రామదుర్గ తాలుకా చుంచనూర్ వద్ద గురువారం తెల్లవారుజామున బొలెరో పికప్ వాహనం అదుపుతప్పి  చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. మరికొందరికి  గాయాలు కాగా.. వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చిక్సిత పొందుతున్నారు. బాధితులు దైవదర్శనం కోసం వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని రామదుర్గ్ తాలూకాలోని హల్‌కుంద్ గ్రామానికి చెందిన వ్యక్తులు సవదత్తిలోని రేణుక ఎల్లమ్మ ఆలయానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బాధితులు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. 

ఈ ప్రమాదం గురించి సమాచారం అందినే వెంటనే పోలీసులు అక్కడికి చేరుకన్నారు. ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఆరో వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రి గోవింద్ కర్జోల్ మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. 

ఇక, ప్రమాదం జరిగిన సమయంలో బొలెరో పికప్ వాహనంలో 23 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. మృతులు కాలినడకన ఎల్లమ్మ ఆలయానికి బయలుదేరారు. ఈ సమయంలో బొలెరో వాహనం డ్రైవర్‌ యాత్రికులను ఆపి మరీ వారిని గుడివద్ద దింపుతానని చెప్పి వాహనం ఎక్కించాడు. వారు వాహనం ఎక్కిన నిమిషాల వ్యవధిలోనే ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మృతులను హనుమవ్వ(25), దీప(31), సవిత(17), సుప్రీత(11), మారుతి(42), ఇందిరవ్వ(24) మృతి చెందారు. అయితే చించనూర్ గ్రామ సమీపంలో మలుపు వద్ద డ్రైవర్.. వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. 

click me!