
కొచ్చి: కేరళకు చెందిన ప్రొఫెసర్ టీ జే జోసెఫ్ చేయి నరికిన కేసులో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఆరుగురిని దోషులుగా తేల్చింది. గురువారం ఈ ఆరుగురికి శిక్ష విధించింది. ఇందులో ముగ్గురికి జీవిత ఖైదు విధించగా.. మిగిలిన ముగ్గురికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్టు తీర్పు ఇచ్చింది. అయితే, మూడేళ్ల జైలు శిక్ష పడ్డ ముగ్గురికి బెయిల్ మంజూరు చేసింది.
ఈ కేసులో సాజిల్, నాజర్, నజీబ్‌లకు కఠిన యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. కాగా, నౌషద్, మోయిదీన్, అయూబ్‌లకు మూడేళ్ల జైలు శిక్షను ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు శిక్ష విధించింది. దోషులందరూ రూ. 4 లక్షలు ప్రొఫెసర్ టీ జే జోసెఫ్‌కు అందించాలనీ ఆదేశించింది.
ప్రొఫెసర్ టీ జే జోసెఫ్ కేసులో మొత్తం 11 మందిని కోర్టు విచారించింది. ఇందులో సాజిల్, ఎంకే నాజర్, షఫీక్, నజీబ్ కేఏ, అజీజ్ ఒదక్కల్, మొహమ్మద్ రఫీ, సుబేర్ టీపీ, ఎంకే నౌషద్, మన్సూర్, పీపీ మోయిదీన్ కుంజు, పీఎం అయూబ్‌లు ఉన్నారు. అయితే, రెండో దశ విచారణకు వచ్చే సరికి కోర్టు సాజిల్, ఎంకే నాజర్, నజీబ్ కేఏ, ఎంకే నౌషద్, మన్సూర్, పీపీ మోయిదీన్ కుంజు, పీఎం అయూబ్‌లను దోషులుగా తేల్చింది మిగిలిన వారిని బుధవారం నిర్దోషులుగా ప్రకటించింది.
Also Read: ‘కరెంట్’తో రేవంత్ రెడ్డికి ‘షాక్’.. రంగంలోకి కాంగ్రెస్ హైకమాండ్
ఉగ్రవాద చర్యగా ఈ కేసును ఎన్ఐఏ నిరూపించగలిగింది. ప్రొఫెసర్‌ను ఆయుధంతో దాడి చేయడం, పారిపోవడం, కారును నాశనం చేయడం, 143 ఆయుధాలు కలిగి ఉండటం, ఉగ్రవాదం, కుట్ర, ఆయుధంతో దారి, హత్యా ప్రయత్నం సహా ఇతర నేరారోపణలను ఎన్ఐఏ రుజువు చేసింది. ఉపా సహా ఐపీసీలోని పలు సెక్షన్ల కింద నిందితులపై ఎన్ఐఏ చార్జిషీటు ఫైల్ చేసింది.