
Sidhu moosewala new song SYL removed from You Tube: ఇటీవల హత్యకు గురైన పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా (Sidhu Moose Wala) SYL ’(సట్లెజ్ - యమునా అనుసంధానం) పాటను యూట్యూబ్ (YouTube) తొలగించింది. SYL పాటకు రచయిత, స్వరకర్త సిద్ధు ముసేవాలానే. సంగీత నిర్మాత MXRCI ఈ పాటను Sidhu moosewala యూట్యూబ్ చానల్ లో జూన్ 23న విడుదల చేశారు. విడుదలైన ఈ వీడియోకు యూట్యూబ్‌లో 27 మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చాయి. 3.3 మిలియన్ లైక్స్ లభించాయి.
కాగా.. సిధు ముసేవాలా' యూట్యూబ్ ఛానెల్‌లో విడుదలైన ఈ పాట వీడియో ఇకపై కనిపించదు. దానికి బదులుగా.. "ప్రభుత్వం నుండి వచ్చిన చట్టపరమైన ఫిర్యాదు కారణంగా, ఈ కంటెంట్ ను తొలగించడమైంది. ఈ దేశంలోని డొమైన్‌లలో అందుబాటులో లేదు."ఒక సందేశం కనిపిస్తుంది. ఇతర దేశాల YouTube వినియోగదారులు ఈ వీడియోను చూడగలరని అర్థం.
కారణమిదేనా..?
ఈ పాటలో గత మూడు దశాబ్దాలుగా సట్లెజ్ - యమునా అనుసంధాన కాలువ విషయంలో పంజాబ్, హర్యానా ప్రభుత్వాల మధ్య వివాదం జరుగుతోంది. ఎలాంటి ఒప్పందం కుదరని ఈ అంశమే కాకుండా అవిభజిత పంజాబ్, 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన వాక్యాలూ ఈ పాటలో ఉన్నాయి. అలాగే.. సాగు చట్టాలను వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల సంబంధించిన దృశ్యాలు ఈ వీడియోలో కనిపిస్తాయి. దీంతో ప్రభుత్వం నుంచి న్యాయపరమైన ఫిర్యాదులు అందడంతో ఈ కంటెంట్‌ను తొలగించినట్టు యూట్యూబ్ పేర్కొంది. ఈ పాట లింక్‌ను క్లిక్ చేయగా.. ఆ సందేశమే కనిపిస్తోంది.
కాగా.. మే 29న పంజాబ్‌లోని మాన్సా జిల్లాలోని జవహర్కే గ్రామ సమీపంలో దుండగులు జరిగిన కాల్పుల్లో సిద్ధూ ముసేవాలా మరణించారు. పంజాబ్ లో 424 మంది వీఐపీలకు భద్రతను ఉపసంహరిస్తున్నట్టు పంజాబ్ ప్రభుత్వం ప్రకటన చేసిన మరునాడే సిద్ధూపై కాల్పులు జరగడం గమనార్హం.
కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ఈ హత్యకు బాధ్యత వహిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాడు. హత్య సూత్రదారిగా అనుమానిస్తున్న గ్యాంగ్‌లీడర్ లారెన్స్ బిష్ణోయ్‌కి గోల్డీ బ్రార్ సన్నిహితుడని దర్యాప్తులో తేలింది. ఈ హత్య కేసులో ఇప్పటి వరకు పదుల సంఖ్యలో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో ముష్కరుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.కాగా అసెంబ్లీ ఎన్నికలకు ముందే గతడాది డిసెంబర్‌లో సిద్ధూ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.