
భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) . జర్మనీలోని (germany) మ్యూనిచ్‌లో ప్రవాస భారతీయులను (indian diaspora) ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి భారత్ తల్లి వంటిందన్నారు. కొత్త పారిశ్రామిక విప్లవానికి భారత్ నాయకత్వం వహిస్తోందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. భారత్ సాధించాల్సిన లక్ష్యాల జాబితా చాలా పెద్దదని ఆయన అన్నారు. భారత సాంస్కృతిక వైవిధ్యం, ఆహారం, వస్త్రధారణ, సంగీతం, సంప్రదాయాలన్నీ కలిసి ప్రజాస్వామ్యాన్ని చైతన్యవంతంగా మార్చాయని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.
నేడు దేశంలోని ప్రతి గ్రామంలో విద్యుత్ సదుపాయం ఉందని.. 99 శాతం గ్రామాల్లో వంట గ్యాస్ వాడుతున్నారని ప్రధాని తెలిపారు. దేశంలోని 80 కోట్ల మంది పేదలకు గత రెండేళ్లుగా ఉచిత రేషన్ అందిస్తున్నామని మోడీ స్పష్టం చేశారు. భారత్‌లో ప్రతి పది రోజులకు ఒక యూనికార్న్ (వంద కోట్ల డాలర్ల కంపెనీ) రూపొందుతోందని ఆయన వెల్లడించారు. గత శతాబ్దంలో పారిశ్రామిక విప్లవంతో జర్మనీ, ఇతర దేశాలు లబ్ధి పొందాయన్న ప్రధాని మోడీ.. అప్పట్లో మన దేశం వలస రాజ్యంగా ఉండేదని, అందుకే ఆ ఫలాలను పొందలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కానీ ఇప్పుడు భారత్ పారిశ్రామిక విప్లవం విషయంలో ముందుందని.. ప్రపంచానికి నాయకత్వం వహిస్తోందని తెలిపారు. పది శాతం ఇథనాల్‌తో కూడిన పెట్రోల్‌ను లక్ష్యంగా పెట్టుకోగా.. ఐదు నెలల క్రితం భారత్ ఈ టార్గెట్‌ను సాధించిందని ప్రధాని పేర్కొన్నారు. పురోగతి సాధించడానికి, అభివృద్ధి పథంలో దూసుకుపోవడానికి, కలలను సాకారం చేసుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని మోడీ స్పష్టం చేశారు. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న రెండో దేశమైన భారత్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలంటే 10-15 ఏళ్లు పడుతుందనే మాటలు వినిపించాయని ప్రధాని అన్నారు. కానీ ఇప్పటికే మన దేశంలో 197 కోట్ల డోసుల టీకాలు వేశామని ఆయన వెల్లడించారు. తమ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 10 కోట్ల టాయిలెట్లను నిర్మించిందని మోడీ తెలిపారు.
ఇకపోతే.. జర్మనీ పర్యటనలో (modi germany tour) భాగంగా ప్రధాని మోడీ జీ-7 సదస్సుకు హాజరుకానున్నారు. ఎనర్జీ, ఆహార భద్రత, ఉగ్రవాదంపై పోరాటం, పర్యావరణం, ప్రజాస్వామ్యం తదితర అంశాలపై జీ-7 దేశాల అధినేతలతో ఆయన చర్చించనున్నారు.