
కాంగ్రెస్ నేత, కర్ణాటక మాజీ సీఎం సిద్దా రామయ్య వివాదంలో చిక్కుకున్నారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతలను కుక్కలతో పోల్చడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ‘‘ నేను వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు బీజేపీకి చెందిన 25 మంది ముధోల్ (హౌండ్) కుక్కల మాదిరిగా నాపై మొరగడం ప్రారంభిస్తారు. కానీ వారు మొరిగినప్పుడు నేను మాత్రమే మాట్లాడాలి. మా పార్టీ నుండి మరెవరూ మాట్లాడరు ’’ అని బుధవారం మైసూరులో జరిగిన ఒక కార్యక్రమంలో సిద్దా రామయ్య మాట్లాడారు.
తమ వాళ్లు ఎవరూ మాట్లాడబోరని, అందుకే తమ ఆఫీసు నుంచి పుస్తకాలు పంచిపెట్టామని సిద్దా రామయ్య తెలిపారు. రాష్ట్రంలో పాఠ్యపుస్తకాల కాషాయీకరణకు వ్యతిరేకంగా బెంగళూరులోని విధాన సౌధ వద్ద కర్ణాటక కాంగ్రెస్ నిర్వహించిన నిరసనలోనూ మాజీ సీఎం పాల్గొన్నారు. సవరించిన పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకు తమ నిరసనలు కొనసాగుతాయని అన్నారు. ‘‘ సనాతన ఆర్ఎస్ఎస్ కు చెందిన రోహిత్ చక్రతీర్థం (పాఠ్యపుస్తక సవరణ కమిటీ అధిపతి) ఈ పాఠ్యపుస్తకాన్ని సవరించారు. ప్రభుత్వం దానిని సవరించడాన్ని పరిశీలిస్తుందని నేను ఆశిస్తున్నాను. లేకపోతే మేము వీధుల్లోకి వెళ్లి మరిన్ని ఆందోళనలు చేస్తాం ’’ అని తెలిపారు.
ముధోల్ హౌండ్ అంటే కుక్కల్లో ఒక రకమైనవి. వీటిని కారవాన్ హౌండ్ అని కూడా పిలుస్తారు. వీటిని సాధారణంగా కర్ణాటకలోని గ్రామస్తులు వేట కోసం, కాపలా కుక్కలుగా ఉపయోగిస్తుంటారు. ఇదిలా ఉండగా.. రచయిత రోహిత్ చక్రతీర్థం నేతృత్వంలో 2020 సంవత్సరంలో కర్ణాటక ప్రభుత్వ పాఠ్యపుస్తక సవరణ కమిటీని ఏర్పాటు చేసింది. ఇది ఇటీవల 6 నుండి 10 తరగతుల వరకు సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాలను, 1 నుంచి 10 తరగతుల వరకు కన్నడ భాషా పాఠ్యపుస్తకాలను సవరించింది.
అయితే ఈ పాఠ్య పుస్తకాలను కాషాయీకరణకు అనుకూలంగా మార్పులు చేశారని గత కొంత కాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో గత నెలలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పందించారు. పాఠ్య పుస్తకాల నుంచి భగత్ సింగ్ అధ్యాయాన్ని తొలగించారని, ఇది సరైంది కాదని తెలిపారు. బీజేపీ దేశ భక్తులను ఎందుకు అంతగా ద్వేషిస్తోందని తెలిపారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్వాతంత్ర సమరయోధులకు జరిగే ఇలాంటి అవమానాన్ని భారత్ సహించబోదని అన్నారు.
Jammu and Kashmir : జమ్మూ కాశ్మీర్ లో ఉద్రిక్తత.. భదర్వాలో కర్ప్యూ.. ఫ్లాగ్ మార్చ్ కు పిలుపు..
కాగా పదో తరగతి విద్యార్థులకు కన్నడ పాఠ్యపుస్తకంలో హెడ్గేవార్ ప్రసంగాన్ని చేర్చడాన్ని కర్ణాటక ప్రాథమిక, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి బిసి నగేష్ సమర్థించారు. ఈ పాఠ్యపుస్తకం హెడ్గేవార్ లేదా ఆర్ఎస్ఎస్ గురించి కాదని అన్నారు. ప్రజలను, ముఖ్యంగా యువతను మోటివేట్ చేయడానికి మాత్రమే వీటిని చేర్చామని చెప్పారు. దానిని ఉద్దేశించి మాత్రమే హెడ్డేవార్ ప్రసంగం ఏర్పాటు చేశామని తెలిపారు. పాఠ్య పుస్తకం సవరణపై ప్రశ్నిస్తున్న వ్యక్తులు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదని విమర్శించారు.