శ్రద్ధా వాకర్‌ హత్య కేసు: కోపంలో శ్రద్దాను చంపేశాను.. కోర్టు ముందు వెల్లడించిన అఫ్తాబ్

By Sumanth KanukulaFirst Published Nov 22, 2022, 12:44 PM IST
Highlights

శ్రద్ధా వాకర్‌ అనే యువతిని ఆమెతో సహజీవనం చేస్తున్న  అఫ్తాబ్ పూనావాలా దారుణంగా హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

శ్రద్ధా వాకర్‌ అనే యువతిని ఆమెతో సహజీవనం చేస్తున్న  అఫ్తాబ్ పూనావాలా దారుణంగా హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అఫ్తాబ్‌కు కోర్టు విధించిన ఐదు రోజుల కస్టడీ నేటితో ముగియడంతో ఢిల్లీ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అఫ్తాబ్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీలోని సాకేత్ కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. దీంతో న్యాయస్థానం అఫ్తాబ్‌కు పోలీసు కస్టడీని మరో నాలుగు రోజుల పాటు పొడిగించింది. 

ఇక, తాను క్షణికావేశంలోనే శ్రద్దా వాకర్‌ను హత్య చేసినట్టుగా అఫ్తాబ్ కోర్టు ముందు అంగీకరించాడు. ‘‘ఆ రోజు జరిగింది ఏదైతే ఉందో.. అదంతా ఘర్షణ వాతావరణంలో క్షణికావేశంలో జరిగింది’’ అని అఫ్తాబ్ చెప్పాడు. తాను పోలీసులకు సహకరిస్తున్నానని, శ్రద్దా శరీర భాగాలను  పడేసిన ప్రదేశానికి సంబంధించిన మ్యాప్‌లను కూడా ఇచ్చానని తెలిపాడు. శ్రద్దా హత్యకు సంబంధించిన అన్ని వివరాలను అందజేస్తానని కోర్టుకు హామీ ఇచ్చాడు. అయితే చాలా కాలం గడిచినందున చాలా విషయాలు గుర్తుకు రాలేదని అన్నాడు. 

ఆఫ్తాబ్ న్యాయవాది అవినాష్ మాట్లాడుతూ.. ‘‘తాను పోలీసులకు సహకరిస్తున్నానని, పోలీసులు కూడా తనతో మంచిగా వ్యవహరిస్తున్నారని కోర్టుకు అఫ్తాబ్ చెప్పాడు. తాను వారిని తప్పుదారి పట్టించడం లేదా అబద్ధం చెప్పడం లేదని చెప్పాడు. పోలీసులు కూడా కోర్టులో తన వాదనను వ్యతిరేకించలేదు’’ అని చెప్పారు.

ఇదిలా ఉంటే.. విచారణ సమయంలో గురుగ్రామ్ డీఎల్ఎఫ్ ఫేజ్ 3లోని పొదల్లో శ్రద్ధా వాకర్ మృతదేహాన్ని నరికివేయడానికి ఉపయోగించిన రంపాన్ని, బ్లేడ్‌ను విసిరినట్లు ఆఫ్తాబ్ చెప్పాడని ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. ఢిల్లీ పోలీసు బృందం ఆ పొదలను రెండుసార్లు తనిఖీ చేసిందని వెల్లడించాయి. దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీలో 100 అడుగుల రోడ్డు వద్ద అతను మాంసం కొట్టే కత్తిని డస్ట్‌బిన్‌లో విసిరినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

click me!