ఎన్డీఏ నుండి బయటకొస్తాం: బిజెపిపై నిప్పులు చెరిగిన శివసేన

First Published Jun 19, 2018, 12:17 PM IST
Highlights

మరోసారి బిజెపిపై శివసేన ఘాటు వ్యాఖ్యలు


ముంబై: ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై శివసేన మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.  శివసేన 52వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ పత్రిక సామ్నాలో  శివసేన బిజెపిపై  సంచలన వ్యాఖ్యలు చేసింది.

బీజేపీ ప్రభుత్వం దేశంలోని పలు రంగాలకు తీవ్ర అన్యాయం చేస్తోందంటూ దుయ్యబట్టింది.  ఎన్డీయే నుండి తాము బయటికి రావడం తథ్యమని స్పష్టం చేసింది. మహారాష్ట్రలో జరిగే తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో తాము సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ ధీమాను వ్యక్తం చేసింది.  2019 సార్వత్రిక ఎన్నికల్లో కింగ్ మేకర్‌గా వ్యవహరిస్తామని శివసేన అభిప్రాయపడింది.

శివసేన ప్రయాణం నల్లేరు మీద బండి నడకలా ఎప్పుడూ సాగలేదు. మా మార్గంలో ఇప్పటికీ అనేక ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. అయినా సరే అన్ని అవరోధాలను అధిగమించి, వచ్చే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి విజయం సాధిస్తామని ఆ పార్టీ ప్రకటించింది.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సైతం ప్రధాన భూమిక పోషిస్తామని శివసేన అభిప్రాయపడింది.  ఎన్డీఏ నుండి కూడ బయటకు వస్తామనే సంకేతాలను ఆ పార్టీ ఇచ్చింది. వారం రోజుల క్రితం బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా  ముంబైలో శివసేన చీఫ్  ఉద్దవ్ ఠాక్రే ఇంటికి వెళ్ళి సమావేశమయ్యారు. ఈ రెండు పార్టీల మధ్య సంబంధాలు పునరుద్దరించే దిశగా చర్చలు సాగినట్టుగా బిజెపి నేతలు ప్రకటించారు.

ఈ సమావేశం ముగిసిన మరునాడే  2019 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని శివసేన  ప్రకటించింది.  ప్రస్తుతం మహరాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వంతో శివసేన తెగతెంపులు చేసుకొంది.  కానీ, ఎన్డీఏ మాత్రం ఆ పార్టీ కొనసాగుతోంది. త్వరలోనే శివసేన కూడ  బయటకు రావాలని ప్రయత్నాలు చేస్తోంది.
 

click me!