
పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లో అనుచితంగా ప్రవర్తించారనే కారణంతో 12 మంది రాజ్యసభ (Rajya Sabha) సభ్యులపై సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. వారిపై పార్లమెంట్ శీతకాల సమావేశాలు మొత్తం సస్పెన్షన్ కొనసాగుతుందని రాజ్యసభ వర్గాలు వెల్లడించాయి. అయితే దీనిని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడును కూడా ప్రతిపక్ష సభ్యులు కోరారు. అయితే అందుకు వెంకయ్య నాయుడు నిరాకరించారు. దీంతో ప్రతిపక్ష పార్టీల సభ్యులు తమ ఆందోళనను కొనసాగిస్తునే ఉన్నారు.
అయితే రాజ్యసభ నుంచి సస్పెన్షన్‌కు గురైన వారిలో శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది (Shiv Sena MP Priyanka Chaturvedi) కూడా ఉన్నారు. అయితే తనపై సస్పెన్సన్ వేటు ఉండటంతో ఆమె షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. సంసద్ టీవీలో (Sansad TV) ఒక షోకు యాంకర్‌గా ఉన్న ప్రియాంక చతుర్వేది.. ఆ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ప్రియాంక రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకు (Venkaiah Naidu) ఒక లేఖ రాశారు. ‘సంసద్ టీవీ మేరీ కహానీ షో యాంకర్‌గా వైదొలగడం చాలా బాధగా ఉంది. మా 12 మంది ఎంపీలను ఏకపక్షంగా సస్పెండ్ చేసిన కారణంగా పార్లమెంటరీ విధులను నిర్వర్తించలేను. కాబట్టి నేను ఇక్కడ ఎలాంటి బాధ్యతలు చేపట్టలేను. అందుకే ఈ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నాను’ అని ప్రియాంక పేర్కొన్నారు. తన లేఖను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
‘ఈ సస్పెన్షన్‌తో నా ఎంపీ ట్రాక్ రికార్డు కూడా పాడైపోయింది. అన్యాయం జరిగిందని భావిస్తున్నాను. కానీ చైర్మన్ దృష్టిలో అది సమర్థించబడితే.. నేను దానిని గౌరవించవలసి ఉంటుంది’ అని ప్రియాంక తన లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా తనను ఈ బాధ్యతకు అర్హులుగా భావించి అవకాశం కల్పించిన వెంకయ్య నాయుడకు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తన నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్టుగా ప్రియాంక చతుర్వేది పేర్కొన్నారు.
Also read: Rajya sabha: ఎంపీలపై సస్పెన్షన్ రద్దు చేసేందుకు వెంకయ్య నాయుడు నిరాకరణ.. విపక్షాల వాకౌట్
రాజ్యసభ నుంచి సస్పెండ్ అయిన ఎంపీలలో.. ఎలమరం కరీం (సీపీఎం), ఫూలో దేవి నేతమ్ (కాంగ్రెస్), ఛాయా వర్మ (కాంగ్రెస్), రిపున్ బోరా (కాంగ్రెస్), బినోయ్ విశ్వం (సీపీఐ), రాజమణి పటేల్ (కాంగ్రెస్), డోలా సేన్ (టీఎంసీ), శాంత ఛెత్రి (టీఎంసీ), సయ్యద్ నాసిర్ హుస్సేన్ (కాంగ్రెస్), ప్రియాంక చతుర్వేది (శివసేన), అనిల్ దేశాయ్ (శివసేన), అఖిలేష్ ప్రసాద్ సింగ్ (కాంగ్రెస్) ఉన్నారు.