ఆమె కొత్తగా ఇన్‌స్టా రీల్స్ చేసే వ్యాపకం పెట్టుకుంది. వీటితో సోషల్ మీడియా నుంచి చాలా మందిని మిత్రులుగా చేసుకుంది. అందులో రుణాలు ఇచ్చే ఏజెన్సీకి చెందిన ఓ వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. వీరిది అక్రమ సంబంధం అని భర్త అనుమానించాడు. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని భార్యను చెబితే వినిపించుకోలేదు. దీంతో భార్యను చంపేశాడు.
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో సోషల్ మీడియా కారణంగా ఓ నిండు ప్రాణం పోయింది. 17 ఏళ్ల దాంపత్య జీవితం హత్యతో ముగిసింది. భార్య ఇన్‌స్టా రీల్స్ చేయడం భర్తకు ఇష్టం లేదు. సోషల్ మీడియాలో కొత్త మిత్రులు అవుతుండటం ఆయనకు నచ్చలేదు. అంతేకాదు, ఈ సోషల్ మీడియా కారణంగా ఓ వ్యక్తితో తన భార్యకు దగ్గరి సంబంధం ఏర్పడిందని, వారికి అక్రమ సంబంధం కూడా ఉన్నదని అనుమానించాడు. చివరికి భార్యను హత్య చేశాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని హరినారాయణ్‌పూర్‌లో నవంబర్ 24వ తేదీన ఈ ఘటన చోటుచేసుకుంది.
జోయానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో నివసించే పరిమల్ బైద్య, అపర్ణ భార్య భర్తలు. 17 ఏళ్ల కాపురం. వారికి ఏడో తరగతి చదివే కొడుకు, నర్సరీలో ఉన్న కూతురు ఉన్నారు. అపర్ణ సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపడం మొదలు పెట్టింది. ఇన్‌స్టా రీల్స్ ప్రారంభించింది. ఈ రీల్స్‌తో సోషల్ మీడియా నుంచి చాలా మంది కొత్త మిత్రులు ఆమె అయ్యారు. వారితో తరుచూ ఆమె టచ్‌లో ఉండేది. ముఖ్యంగా ఓ మనీ లెండింగ్ ఏజెన్సీకి చెందిన వ్యక్తితో ఆమెకు ఏర్పడిన పరిచయంపై భర్తకు అనేక అనుమానాలు మొదలయ్యాయి.
Also Read : Tejas: ప్రధాని మోడీ ప్రయాణించిన తేజస్ ఫైటర్ జెట్ గురించి 5 ముఖ్య విషయాలు
వీరు అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు భర్త అనుమానించాడు. ఈ విషయమై చాలా సార్లు గొడవలయ్యాయి. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని భార్యకు వార్నింగ్ ఇచ్చాడు. కానీ, ఆమె నిరాకరించింది. గురువారం రాత్రి కూడా ఈ దంపతుల మధ్య తీవ్రమైన గొడవ జరిగినట్టు కొడుకు చెప్పాడు. మరుసటి రోజే భార్య గొంతు కోసి పరిమల్ హత్య చేశాడు. పారిపోయాడు. ఈ సమయంలో కొడుకు, బిడ్డ ఇద్దరూ ఇంటిలో లేరు. కొడుకు ఇంటికి రాగానే రక్తపు మడుగులో పడి ఉన్న తల్లిని చూసి కేకలు వేశారు. ఇరుగు పొరుగు వారు వచ్చి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
గతంలో కూడా ఆమె భర్తను వదిలిపెట్టి పుట్టింటికి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని రికవరీ చేసుకున్నామని, పరిమల్ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. అపర్ణ డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం పంపినట్టు వివరించారు.