మ‌రో మూడు వారాల్లో ఆ అంశంపై క్లారిటీ ఇస్తా.. :శశిథరూర్ 

By Rajesh KFirst Published Aug 31, 2022, 4:00 PM IST
Highlights

కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నిక‌ల్లో  ఆ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ పోటీ చేస్తారనే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. దీనిపై ఆయన స్పందించారు. మ‌రో మూడు వారాల్లో ఆంశంపై స్పష్టత ఇస్తానని తెలిపారు.  

కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ పోటీ చేస్తార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. అయితే.. ఈ ఆంశంపై ఎంపీ శశిథరూర్ స్పందించారు. అధ్యక్ష ఎన్నికల్లో  తాను పోటీ చేస్తానా?  లేదా? అనే విషయాన్ని ఇప్పుడే చెప్ప‌లేన‌నీ, అలాగే.. ఆ విషయాన్నితోసిపుచ్చేందుకు సిద్ధంగా లేన‌నీ ఎంపీ శశిథరూర్ అన్నారు.

ఆ అంశంపై  స్ప‌ష్ట‌త కోసం.. మరో మూడు వారాల పాటు వేచి ఉండాల‌ని. ఆ త‌రువాత దానిపై ఓ క్లారిటీ ఇవ్వగలనని అన్నారు. ఇప్పుడు ఎక్కువ వ్యాఖ్యానించడానికి సిద్ధంగా లేనని అన్నారు. అయితే.. ఒక్క విషయం మాత్రం కచ్చితంగా చెప్పగలనని   ప్రజాస్వామ్య పార్టీలో ఎన్నికలు జ‌ర‌గ‌డం ఎప్పుడైనా శుభపరిణామమే అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయట్లేదని గాంధీ కుటుంబం ఇప్పటికే స్పష్టం చేసిందని థరూర్‌ పేర్కొన్నారు. గాంధీయేతరులు కాంగ్రెస్ అధ్యక్షులైతే మంచిదన్నారు.  

అధ్యక్ష ఎన్నికల్లో గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయకుంటే థరూర్‌ బరిలో ఉంటారని, గాంధీ కుటుంబం నుంచి అశోక్‌ గెహ్లాట్‌ను అభ్యర్థిగా బరిలోకి దింపుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. థరూర్ ఇటీవల ఒక ప్రాంతీయ దినపత్రికలో రాసిన సంపాదకీయంలో ఎన్నికలు పారదర్శకంగా జరగాలని థరూర్ పేర్కొనడం వీటికి బలం చేకూర్చింది. అంతేకాదు నామినేషన్లు కాకుండా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకునేందుకు కూడా ఎన్నికలు జరగాలని ఆయ‌న సూచించారు. అధ్యక్షుడిని ఎన్నుకోవడం పార్టీకి పునరుజ్జీవనానికి నాంది అని, దీనికి చాలా అవసరం అని ఆయన అన్నారు. 

మరోవైపు .. భారత్ జోడో యాత్ర ప్రచారంలో భాగంగా కేరళకు వచ్చిన ఏఐసీసీ నేత జైరాం రమేష్ మాట్లాడుతూ..థరూర్ వ్యాఖ్యలపై స్పందించారు. ఏఐసీసీ ఎన్నికల షెడ్యూల్ ఖరారైందని , పార్టీలో ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చ‌ని స్పష్టం చేశారు. అక్టోబర్ 17న కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడిని వస్తాడ‌నీ, కాంగ్రెస్ ప్రజాస్వామ్య పార్టీ అని రమేష్ అన్నారు.

click me!