శివసేన నుండి ఒత్తిడి లేదు: హోం మంత్రి అనిల్‌ను వెనకేసుకొచ్చిన పవార్

By narsimha lodeFirst Published Mar 22, 2021, 2:42 PM IST
Highlights

మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ పై వచ్చిన ఆరోపణలు రాష్ట్రంలో శివసేన-ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వంపై  పార్లమెంట్ లో ఆందోళన చేశాయి. ఈ తరుణంలో మంత్రి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తోసిపుచ్చారు.


ముంబై:మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ పై వచ్చిన ఆరోపణలు రాష్ట్రంలో శివసేన-ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వంపై  పార్లమెంట్ లో ఆందోళన చేశాయి. ఈ తరుణంలో మంత్రి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తోసిపుచ్చారు.

సోమవారం నాడు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఈ విషయమై మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ అరెస్టైన సచిన్ వాజేను కలిసినట్టుగా చేసిన ఆరోపణలపై కూడ ఆయన స్పందించారు.

సచిన్ వాజే కలిసినట్టుగా చెబుతున్న తేదీల్లో మంత్రి ఆసుపత్రిలో ఉన్నాడని శరద్ పవార్ చెప్పారు. దీంతో రాజీనామా సమస్యే ఉత్పన్నం కాదన్నారు.

హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ రాజీనామా చేయాలని శివసేన నుండి ఎలాంటి ఒత్తిడి లేదని ఆయన తేల్చి చెప్పారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 5 నుండి 15 వరకు ఆసుపత్రిలో ఉన్నాడని ఆయన చెప్పారు. 

 ఫిబ్రవరి 15 నుండి 27 వరకు హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ నాగ్‌పూర్ లోని తన నివాసంలో ఐసోలేషన్ లో ఉన్నట్టుగా చెప్పారు శదర్ పవార్. ఈ విషయాలకు సంబంధించి రికార్డులను సీఎం ఉద్దవ్ ఠాక్రేకు అందిస్తామని శరద్ పవార్ చెప్పారు.

హోంమంత్రిపై వచ్చిన ఆరోపణలపై మాజీ పోలీస్ అధికారి జూలియో రిబిరో దర్యాప్తు చేయాలని పవార్ నిన్న సూచించారు. కానీ రిటైర్డ్ పోలీస్ అధికారి ఇందుకు నిరాకరించారు.

ఇవాళ సాయంత్రం నాలుగున్నర గంటలకు సీఎం ఉద్దవ్ ఠాక్రే  రాష్ట్ర న్యాయ మంత్రిత్వ శాఖ అధికారులతో స్వయంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. హోంశాఖపై నిశితంగా దృష్టి పెట్టాలని ఆయన నిర్ణయం తీసుకొన్నారు.

ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ సీఎం ఉద్దవ్ ఠాక్రేకు ఓ లేఖ రాశారు.ఈ లేఖలో  హోంమంత్రిపై అవినీతి ఆరోపణలు చేశారు. ముఖేష్ అంబానీ ఇంటి వద్ద బాంబు కేసులో జోక్యం చేసుకొన్నాడన్నారు. అంతేకాదు ప్రతి నెల రూ. 100 కోట్లను వసూలు చేయాలని  పోలీసులకు హోంమంత్రి నుండి ఒత్తిడి ఉందని ఆయన ఆ లేఖలో ఆరోపించారు.

అంబానీ ఇంటి వద్ద బాంబు కేసును దుర్వినియోగం చేశారనే నెపంతో ఆయనను ఈ పదవి నుండి తప్పించారు. ముంబై కమిషనర్ పదవి నుండి తప్పించిన తర్వాత ఆయన సీఎంకు లేఖ రాశాడు. తనను ముంబై కమిషనర్ పదవి నుండి తప్పిస్తానని హోంమంత్రి బెదిరించాడన్నారు. అంతేకాదు తనపై పరువు నష్టం దావా వేస్తానని బెదిరించాడన్నారు.

వివాదాస్పద చరిత్ర కలిగిన సచిన్ వాజే అంబానీ కేసులో ప్రాథమిక దర్యాప్తు అధికారి. కానీ ఆ తర్వాత ఈ కేసు ఎన్ఐఏ విచారించింది. అంతకుముందు ఆయన సస్పెండయ్యారు. సస్పెన్షన్ గురైన సమయంలో ఆయన శివసేనలో చేరాడు.

థానేకి చెందిన వ్యాపారి ముఖేష్ హిరాన్ తో సచిన్ వాజేకి సన్నిహిత సంబంధాలు ఉన్నట్టుగా ఎన్ఐఏ గుర్తించింది.ముఖేష్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్దాలతో లభించిన వాహనం కూడ హిరానీదిగా ఎన్ఐఏ గుర్తించింది. అయితే హిరాన్  మార్చి 5న అనుమానాస్పదద స్థితిలో మరణించాడు.

తమ వాహనాన్ని సస్పెండైన పోలీసు అధికారి తమ వాహనాన్ని నాలుగు మాసాల పాటు ఉపయోగించినట్టుగా హిరాన్ భార్య ఆరోపించారు.

ముకేష్ అంబానీ ఇంటి వద్ద బాంబు కేసుకు సంబంధించిన అంశాన్ని ఎన్ఐఏ దర్యాప్తు చేయడంపై శివసేన అనుమానాలను లేవనెత్తింది. ఈ కేసును మహారాష్ట్ర ఏటీఎస్ కూడ నిర్వహించే సత్తా ఉందని శివసేన అభిప్రాయపడిన విషయం తెలిసిందే.
 

click me!