రాజకీయ చాణక్యుడిగా మరోమారు నిరూపించుకున్న శరద్ పవార్

By telugu teamFirst Published Sep 28, 2019, 12:24 PM IST
Highlights

ప్రచారం మధ్యలో ఉండగా ఇలా తనను అరెస్ట్ చేస్తే ఎన్నికలప్పుడు తమ పార్టీ ఇబ్బంది పడుతుందని అన్నాడు. అందుకే వారు పిలిచేకంటే ముందే తాను వస్తానని అప్పుడు ఎన్నికలప్రచారంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా తాను ప్రచారం కొనసాగించుకోవచ్చని తెలిపాడు. 

బారామతి : భారత రాజకీయాల్లో శరద్ పవార్ ను రాజకీయ చాణక్యుడిగా ఎందుకు పేర్కొంటారో మరోమారు అతనే నిరూపించారు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. అధికార బీజేపీ- శివసేనలు పొత్తు కుదుర్చుకునే పనిలో తీవ్రంగా నిమగ్నమయ్యి ఉన్నారు. ఉన్న 288 సీట్లలో ఖచ్చితంగా 50శాతం సీట్లు కావాలని పట్టుబడుతోంది శివ సేన. బీజేపీ మాత్రం 117-120 సీట్లను మాత్రమే ఇవ్వడానికి సుముఖంగా ఉంది. మధ్యే మార్గంగా 125 సీట్లు శివసేనకు పొత్తులో భాగంగా దక్కవచ్చు అని అంటున్నారు. 

మరోపక్క విపక్ష కాంగ్రెస్ ఎన్సీపీల మధ్య కూడా పొత్తు కుదిరింది. తాజా రాజకీయ ఫిరాయింపులవల్ల కాంగ్రెస్, ఎన్సీపీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కాంగ్రెస్ పరిస్థితయితే మరీ దారుణంగా తయారయ్యింది. వారికి అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకడం లేదు. ఎన్సీపీ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. 

మహారాష్ట్రలోని చెక్కర బెల్ట్ ఏరియా లో శరద్ పవార్ కు బలమైన పట్టు ఉంది. అక్కడి నేతలు కూడా పవార్ కి నమ్మకస్తులుగా ఉంటూ వచ్చారు. కాకపోతే ఎన్నికలు వచ్చేసరకు వారంతా గోడ దూకి బీజేపీలో చేరిపోయారు. విపక్ష అభ్యర్థుల మీద పెరుగుతున్న ఐటీ, ఈడి దాడుల వల్లనే వారంతా అధికార బీజేపీలో చేరుతున్నారని ఎన్సీపీ ఆరోపిస్తోంది. 

ఇదిలా ఉండగా నిన్న శరద్ పవార్ ఒక ప్రెస్ మీట్ కు విలేఖరులను ఆహ్వానించాడు. ఈ సమావేశంలో తాను రేపు ఈడీ ఆఫీసుకు వస్తున్నానని, తన మీద ఎటువంటి ఆరోపణలున్నా, రేపొక్కరోజులోనే దయచేసి విచారణ పూర్తిచేయాలని కోరాడు. కావాలంటే, తనను అరెస్ట్ కూడా చేసుకోవచ్చని తెలిపాడు. 

ఈ హఠాత్ పరిణామంతో విస్తుపోయిన ఈడీ అధికారులకు నోట మాట రాలేదు. తాము అసలు శరద్ పవార్ పై కేసు కూడా రిజిస్టర్ చేయనప్పుడు ఆయనెందుకు ఇక్కడికి రావాలనుకుంటున్నాడో తమకు అర్థం కావడంలేదన్నారు. 

ఇక్కడే శరద్ పవార్ రాజకీయ చాణక్యమంతా బయటపడింది. తమ పార్టీ నాయకులందరిపైనా అధికారులతో దాడులు చేపిస్తూ అరెస్టులు చేస్తున్న నేపథ్యంలో తనను కూడా వదిలిపెట్టరని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని అన్నాడు. ప్రచారం మధ్యలో ఉండగా ఇలా తనను అరెస్ట్ చేస్తే ఎన్నికలప్పుడు తమ పార్టీ ఇబ్బంది పడుతుందని అన్నాడు. అందుకే వారు పిలిచేకంటే ముందే తాను వస్తానని అప్పుడు ఎన్నికలప్రచారంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా తాను ప్రచారం కొనసాగించుకోవచ్చని తెలిపాడు. 

ఒక్కసారిగా ప్రజల్లో సానుభూతిని కొట్టేసారు శరద్ పవార్. ఈ వచ్చిన సానుభూతి వల్ల శరద్ పవార్  ఏదో మహారాష్ట్ర ఎన్నికల్లో అద్భుతం జరిగి శరద్ పవార్ సీట్లన్నీ గెలిచే పరిస్థితి లేదు. కానీ ఎంతోకొంతమేర ప్రజల్లో సానుభూతి పవనాలు మాత్రం శరద్ పవార్ మీదకు వీస్తున్నాయి. 

click me!