కేంద్ర మంత్రిపై శరద్ పవార్ ప్రశంసలు.. ‘అధికారాన్ని ఎలా ఉపయోగించాలో ఆయనకు బాగా తెలుసు’

By telugu teamFirst Published Oct 2, 2021, 7:33 PM IST
Highlights

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన రాజకీయం సినిమాను తలపించాయి. అధికారం కోసం బీజేపీని ఏకాకి చేసి శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ఏకతాటిపైకి వచ్చాయి. అంతటి చరిత్ర ఉన్నప్పటికీ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ప్రత్యర్థపార్టీ బీజేపీ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీపై ప్రశంసలు కురిపించారు.
 

న్యూఢిల్లీ: అవి రెండు ప్రత్యర్థి పార్టీలు. అయినప్పటికీ ఆ రెండు పార్టీల నేతలు ఒకే వేదికను పంచుకున్నారు. అంతేనా, ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్నారు. ఈ అరుదైన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. రాజకీయ నీతిజ్ఞుడిగా పేరున్న ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్.. బీజేపీ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీపై ప్రశంసలు కురిపించారు. అధికారాన్ని ఎలా ఉపయోగించాలో ఆయనకు బాగా తెలుసు అని కితాబిచ్చారు.

మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో శరద్ పవార్ మాట్లాడుతూ‘నేను ఈ మీటింగ్‌కు హాజరుకావడానికి నితిన్ గడ్కారీనే కారణం. అహ్మద్‌నగర్‌లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించే అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయబోతున్నామని, అలాంటి ఈ కార్యక్రమంలో నేను హాజరవ్వాలని ఆయన కోరుకున్నారు’ అని అన్నారు. ‘చాలా చోట్ల శంకుస్థాపనలు చేస్తారు గానీ, పనులు ప్రారంభమవడానికి నెలలు, ఒక్కోసారి ఏళ్లు కూడా గడుస్తాయి. కానీ, గడ్కారీ విషయం అలా ఉండదు. ఆయన ఒక పనికి శంకుస్థాపన చేశారంటే రోజుల వ్యవధిలోనే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. ప్రజా ప్రతినిధులు దేశాభివృద్ధికి ఎలా పనిచేయాలో చెప్పడానికి నితిన్ గడ్కారీ ఒక ఉదాహరణ’ అని పొగడ్తలు కురిపించారు.

గడ్కారీ కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టడానికి ముందు సుమారు 5 వేల కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులు జరిగాయని, కానీ, ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత 12వేల కిలోమీటర్ల పనులు జరిగాయని వివరించారు. ఇదే కార్యక్రమంలో రైతులకూ ఓ కీలక సూచన చేశారు. చెరుకు పంటను కేవలం పంచదార తయారీకే ఉపయోగించాల్సిన పనిలేదని అన్నారు. దీని ద్వారా ఇథనాల్ కూడా తయారవుతుందని, అటువైపు కూడా దృష్టి సారించవచ్చునని వివరించారు.

click me!