పంజాబ్ సంక్షోభం: రాజీనామాపై పునరాలోచనలో సిద్ధూ.. గాంధీల వెన్నంటే ఉంటానంటూ ట్వీట్

By Siva KodatiFirst Published Oct 2, 2021, 4:36 PM IST
Highlights

తాను పదవిలో ఉన్నా, లేకపోయినా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల వెన్నంటే ఉంటానని సిద్దూ స్పష్టం చేశారు. ప్రతికూల శక్తులన్నీ ఏకమై తనను ఓడించేందుకు ప్రయత్నించనివ్వండి... కానీ పాజిటివ్ ఎనర్జీలోని ప్రతి అణువు ఉప్పొంగి పంజాబ్ ను గెలిపిస్తుందని సిద్ధూ ట్వీట్ చేశారు. 

పంజాబ్ కాంగ్రెస్‌లో సంక్షోభానికి కారణమైన వ్యక్తి  ఎవరా అని అడిగితే అందరి వేళ్లూ ఖచ్చితంగా నవజోత్ సింగ్ సిద్ధూ వైపే చూపిస్తాయి. సీఎం అమరీందర్‌తో విభేదాల కారణంగా ఆయన ఏకంగా పీసీసీ అధ్యక్ష పదవినే సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత సీఎం అవ్వాలని ఆశించి భంగపడ్డారు. ఇదే సమయంలో అమరీందర్  సింగ్  పార్టీ మారే వరకు విషయం వెళ్లడంతో .. అనూహ్యం పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు సిద్ధూ.

అయితే పార్టీ పెద్దలు బుజ్జగించడంతో ఆయన తన నిర్ణయంపై పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సిద్ధూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రిల సిద్ధాంతాలను మరింత ముందుకు తీసుకెళతానని తెలిపారు. తాను పదవిలో ఉన్నా, లేకపోయినా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల వెన్నంటే ఉంటానని సిద్దూ స్పష్టం చేశారు. ప్రతికూల శక్తులన్నీ ఏకమై తనను ఓడించేందుకు ప్రయత్నించనివ్వండి... కానీ పాజిటివ్ ఎనర్జీలోని ప్రతి అణువు ఉప్పొంగి పంజాబ్ ను గెలిపిస్తుందని సిద్ధూ ట్వీట్ చేశారు. 

ఇటీవల కెప్టెన్ అమరీందర్ సింగ్ సీఎం పదవికి రాజీనామా చేయగా, కాంగ్రెస్ హైకమాండ్ చరణ్ జిత్ చన్నీని సీఎంగా ఎంపిక చేసింది. ఆ తర్వాత సిద్ధూ పీసీసీకి రాజీనామా చేయడంతో కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపింది. అయితే, నిన్న సిద్ధూ.. సీఎం చరణ్ జిత్ చన్నీతో భేటీ అయిన తర్వాత సమస్య పరిష్కారం అయినట్టు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సిద్ధూ పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతాడని తెలుస్తోంది

click me!