అన్నాచెల్లిలి అనుబంధం: అజిత్ పవార్‌ను హత్తుకున్న సుప్రియా సూలే

By Siva KodatiFirst Published Nov 27, 2019, 3:13 PM IST
Highlights

డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసి శివసేన కూటమి ప్రభుత్వం ఏర్పడేందుకు మార్గం సుగమం చేసిన అజిత్ పవార్‌ను సుప్రియ అప్యాయంగా హత్తుకున్నారు

మహారాష్ట్ర రాజకీయాలను అనూహ్య మలుపు తిప్పిన అజిత్ పవార్‌ ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాల్లో సెంటర్ పాయింట్‌గా మారారు. ఈ క్రమంలో బుధవారం రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి ఆయన హాజరయ్యారు.

ఆయనతో పాటు ఎన్సీపీ రెబల్ ఎమ్మెల్యేలంతా అక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆ పార్టీ అధినేత శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే వారికి స్వాగతం పలికారు. డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసి శివసేన కూటమి ప్రభుత్వం ఏర్పడేందుకు మార్గం సుగమం చేసిన అజిత్ పవార్‌ను సుప్రియ అప్యాయంగా హత్తుకున్నారు.

Also Read:మహా సీఎంగా ఉద్ధవ్: డిప్యూటీ సీఎంలుగా ఆ ఇద్దరే?

అజిత్ దాదాతో తనకు ఎటువంటి వివాదం లేదని.. పార్టీలో ప్రతి ఒక్కరికి పాత్ర ఉందని, పార్టీని ముందుకు తీసుకు వెళ్లేందుకు వారి వారి పాత్ర పోషిస్తున్నారని సుప్రియా సూలే వ్యాఖ్యానించారు. అజిత్ పవార్ మాట్లాడుతూ.. తాను ఎన్సీపిలో భాగమని, ఎప్పటికి పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు.

14వ మహారాష్ట్ర శాసనసభ బుధవారం కొలువుదీరింది. ప్రొటెం స్పీకర్ కొత్త ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి స్పీకర్ విశ్వాస పరీక్ష నిర్వహించనున్నారు. 

మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే డిసెంబర్ 1న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముంబైలోని శివాజీ పార్క్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. బుధవారం సాయంత్రం ముంబై ట్రైడెంట్ హోటల్‌లో శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీల నేతృత్వంలో ఏర్పాటైన మహా వికాస్ అఘాడీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు.

కూటమి నేతగా మూడు పార్టీల ఎమ్మెల్యేలు కలిసి ఉద్ధవ్ థాక్రేను ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే, కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. భారీ సంఖ్యలో విచ్చేసిన మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు నినాదాలతో హోటల్ ప్రాంగణంలో పండగ వాతావరణం నెలకొంది.

కాగా డిప్యూటీ సీఎం పదవిని ఎన్సీపీ, కాంగ్రెస్‌లు చెరో రెండున్నరేళ్లు పంచుకోనున్నాయి. ఎన్సీపీ నుంచి జయంత్ పాటిల్, కాంగ్రెస్ తరపున బాలాసాహెబ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించనున్నారు. 

Also Read:నేను ఎన్సీపీలోనే ఉన్నా: అజిత్ పవార్

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారు. మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ‌ని కలిసిన ఫడ్నవీస్ రాజీనామా లేఖను సమర్పించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మూడు రోజులకే దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేయడం గమనార్హం. 

click me!