
ముంబయి: మహారాష్ట్ర(Maharashtra) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సూపర్ మార్కెట్లు(Super Markets), మామూలు దుకాణాల్లోనూ వైన్ (Wine) అమ్మడానికి ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అన్ని వర్గాల్లోనూ చర్చను లేవదీసింది. ఈ నిర్ణయాన్ని శివసేన నేత సంజయ్ రౌత్ మద్దతు తెలిపారు. వైన్ అనేది లిక్కర్ కాదని ఆయన అన్నారు. ఒక వేళ వైన్ విక్రయాలు పెరిగితే.. దాని ద్వారా రైతులే లబ్ది పొందుతున్నారని వివరించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. బీజేపీ కేవలం అన్ని నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఉంటుందని, కానీ, వారు రైతులకు చేసిందేమీ లేదని విమర్శించారు.
ఈ నేపథ్యంలోనే నెటిజన్లు సోషల్ మీడియాలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వ నిర్ణయంపై సరికొత్త చర్చను లేవదీశారు. ఒక వేళ వైన్ తాగి మహారాష్ట్ర రోడ్లపై తిరిగితే.. పోలీసులు జైలులో పడేస్తారా? లేక దగ్గరలోని బార్‌ల చిరునామా తెలుపుతారా? అంటూ ఓ తుంటరి నెటిజన్ ట్వీట్ చేశారు. సంజయ్ రౌత్ కామెంటను పేర్కొంటూ ఈ ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు ఆసక్తి చూపారు. ఆ వ్యక్తి ప్రభుత్వానికి సరైన ప్రశ్న వేశారని సంబురపడ్డారు. అయితే, ఇంతలోనే ముంబయి పోలీసులు (Mumbai Police) దీనికి సరైన సమాధానం ఇచ్చారు.
ముందు డ్రైవింగ్ చేయడానికి అర్హత పొందాలని పోలీసులు తెలిపారు. మద్యం సేవించిన తర్వాత ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా ట్యాక్సీలో లేదా డ్రైవ్ చేసుకుంటూ కాకుండా.. డ్రైవర్ నడుపుతున్న కారులో ప్రయాణించాలని సూచనలు చేశారు. అంతేకాదు, ఒక వేళ బ్రీత్ అనలైజర్ వారు తాగిన వైన్‌లో ఆల్కహాల్ కంటెంట్‌ను గుర్తిస్తే.. (ఫ్రాంక్‌గా చెప్పాలంటే.. అది గుర్తిస్తుంది కూడా) ఊచల వెనుక తమకు అతిథిగా రావాల్సే ఉంటుందని పేర్కొన్నారు. ప్రశ్నిస్తూ ఆ నెటిజన్ చేసిన ట్వీట్‌కు నెటిజన్లు ఎంత అయితే ఆసక్తి చూపారో.. అదే స్థాయిలో పోలీసుల సమాధానాన్ని చదివీ ఆశ్చర్యలో మునిగిపోయారు.
ఇంకొందరు నెటిజన్లు అంతటితో ఆగలేదు. మళ్లీ సంజయ్ రౌత్ ప్రస్తావన తెచ్చారు. పోలీసు ట్వీట్ చాలా సరదాగా ఉన్నదని ట్వీట్లు చేశారు. అలాగే, సంజయ్ రౌత్ కారుపై కన్నేసి ఉంచాలని పేర్కొన్నారు. ఎందుకంటే.. ఆయన వైన్ ఆల్కహాల్ కాదని భావిస్తున్నాడని తెలిపారు. కాగా, పోలీసు ట్వీట్లు తెగ నచ్చేసి వావ్.. వాట్ ఎ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటూ పొగడ్తలు కురిపించారు. అంతేకాదు, మీ ట్వీట్లు రాయడానికి ఎవరినైనా కమెడియన్‌ను హైర్ చేశారా? అంటూ అనుమానం వ్యక్తం చేశారు.
ముంబయి పోలీసులు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. క్రియేటివిటీగానూ రెస్పాండ్ అవుతుంటారు. వారు అవకాశం దొరికినప్పుడల్లా తమ క్రియేటివిటీని వెల్లడిస్తూనే ఉంటారు. పండుగలు, ట్రెండింగ్ న్యూస్, ఎలాంటి అవగాహన కార్యక్రమాలనైనా తమదైన శైలిలో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటారు. కాగా, ముంబయి పోలీసుల సృజనాత్మకతను నెటిజన్లు తరుచూ ప్రశంసిస్తుంటారు. తాజాగా మరోసారి ముంబయి పోలీసులు తమ క్రియేటివిటీని వెల్లడించారు.