
చెన్నై : అమ్మాయి ఒంటరిగా కనిపించిందటే చాలు కొందరు ఆకతాయిలు దారుణంగా ప్రవర్తిస్తుంటారు. యువతులు, మహిళలపైనే కాదు చివరకు చిన్నారులపైనా లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అమానుష ఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు చేసినా, పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా మహిళలకు రక్షణ దక్కడం లేదు. చివరకు భారతదేశంలో సమాజసేవ చేయడానికి వచ్చిన విదేశీ యువతి కూడా ఓ ఆకతాయి లైంగిక వేధింపులకు గురయ్యారు. దేశ పరువు తీసేలా విదేశీ అతిథితో యువకుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
జర్మనీకి చెందిన 20ఏళ్ల యువతి భారత దేశ సంస్కృతి సాంప్రదాయాలు నచ్చి సమాజసేవ చేసుకుంటూ తమిళనాడులో వుంటోంది. విళుపురం జిల్లాలోని ఓ గ్రామంలో వుంటూ స్థానిక ప్రజలతో మమేకమై తోచిన సాయం చేస్తుంది. ఇలా విదేశీ మహిళ కాస్త పూర్తిగా తమిళ మహిళగా మరిపోయింది.
అయితే ఇటీవల విదేశీ యువతి స్నేహితురాలిని కలిసేందుకు పుదుచ్చెరిలో ప్రైవేట్ బస్సెక్కి కర్ణాటక రాజధాని బెంగళూరుకు బయలుదేరింది. బస్సులో ఆమె ఒంటరిగా కనిపించడంతో ఓ యువకుడు నీచానికి పాల్పడ్డాడు. అర్థరాత్రి ఆమె నిద్రపోతుండగా దగ్గరికి వెళ్లి చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. అతడి చేష్టలతో యువతికి మెలకువ వచ్చి గట్టిగా కేకలు వేయడంతో బస్సును నిలిపారు.
Read More షాకింగ్ ఘటన: కులాంతర వివాహం చేసుకుందని మేనకోడలి హత్య
యువకుడి లైంగిక వేధింపులకు గురించి విదేశీ యువతి బస్సు సిబ్బంది, తోటి ప్రయాణికులకు తెలపగా వారు దీన్ని లైట్ గా తీసుకున్నారు. యువకుడికి మందలించి బస్సు దించేసి వెళ్ళగొట్టారు. అయితే యువతి మాత్రం ఈ విషయాన్ని అంత ఈజీగా వదిలిపెట్టాలని అనుకోలేదు. బెంగళూరు నుండి తమిళనాడు తిరిగివచ్చిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విదేశీ యువతిని వేధించిన యువకుడిని గుర్తించే పనిలో పడ్డారు. బస్సులోని ప్రయాణికుల వివరాలను సేకరించగా నిందితుడు బెంగళూరుకు చెందినవాడిగా తేలిసింది. అక్కడి పోలీసుల సాయంతో అతడి కోసం గాలిస్తున్నారు.