ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొన్న ట్రక్కు.. ఏడుగురు విద్యార్థుల దుర్మరణం

By Sumanth KanukulaFirst Published Feb 9, 2023, 5:24 PM IST
Highlights

ఛత్తీస్‌గఢ్‌లో గురువారం ఘోర రోడ్డు  ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఏడుగురు విద్యార్థులు మృతిచెందారు. 

ఛత్తీస్‌గఢ్‌లో గురువారం ఘోర రోడ్డు  ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఏడుగురు విద్యార్థులు మృతిచెందారు. వివరాలు.. కాంకర్ జిల్లాలోని కోరార్ గ్రామ సమీపంలో పాఠశాల విద్యార్థులను తీసుకువెళుతున్న ఆటోను ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు విద్యార్థులు మృతిచెందారు. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థికి, ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే వారిని కోరార్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఈ  ప్రమాదాన్ని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ ధ్రువీకరించారు. 

ఇక, ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదం పాఠశాల విద్యార్థుల మరణించారనే వార్త చాలా బాధకలిగించిందని చెప్పారు. చిన్నారుల కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నట్టుగా చెప్పారు. వారికి అన్ని రకాల సహాయం కోసం అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. 

ఇదిలా ఉంటే.. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న కార్మికులపైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. దీంతో వారిని చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు. బాదల్‌పూర్ ప్రాంతంలో ఉన్న హీరో మోటార్స్ కంపెనీ ఉద్యోగుల నైట్ షిప్ట్‌కు వెళ్తున్న సమయంలో దాద్రీ నుంచి నోయిడా వైపు వెళ్తున్న బస్సు వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలకు పంచనామా చేసి పోస్టుమార్టంకు తరలించారు. 

ఇక, ఈ ప్రమాదంలో మృతిచెందినవారిని బీహార్‌కు చెందిన సంకేశ్వర్ కుమార్ (25), మోహ్రీ కుమార్ (22), ప్రయాగ్‌రాజ్‌కు చెందిన సతీష్ కుమార్ (25), గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాకు చెందిన గోపాల్ (34)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ప్రమాదం అనంతరం బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. అతని కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

click me!