ఎన్టీఆర్ సర్కార్‌ని కూలదోయలేదా.. దేశంలో ఇందిర 50 సార్లకు పైనే : కాంగ్రెస్‌‌కు మోడీ కౌంటర్

By Siva KodatiFirst Published Feb 9, 2023, 4:44 PM IST
Highlights

రాష్ట్ర ప్రభుత్వాలను బీజేపీ కూలదోసిందంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలకు ప్రధాని నరేంద్ర మోడీ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పాలకులు ఆర్టికల్ 356ను ఎన్నోసార్లు దుర్వినియోగం చేశారని, ఇందిరాగాంధీ 50 సార్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టారని నరేంద్ర మోడీ గుర్తుచేశారు.
 

బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కూలుస్తోందంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన గురువారం రాజ్యసభలో ప్రసంగించారు. నాడు ఎన్టీఆర్ చికిత్స కోసం అమెరికా వెళ్తే ఆయన ప్రభుత్వాన్ని కూలగొట్టారని మోడీ దుయ్యబట్టారు. ఎంజీఆర్ వంటి దిగ్గజాల ప్రభుత్వాలను కాంగ్రెస్ అక్రమంగా పడగొట్టిందని ప్రధాని చురకలంటించారు. కాంగ్రెస్ పాలకులు ఆర్టికల్ 356ను ఎన్నోసార్లు దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపించారు. స్వయంగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ 50 సార్లకు పైగా ఆర్టికల్ 356తో రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టారని నరేంద్ర మోడీ గుర్తుచేశారు.

దేశ ప్రగతిని కాంగ్రెస్ నాశనం చేసిందని నరేంద్ర మోడీ దుయ్యబట్టారు. యూపీఏ ప్రభుత్వం ఏ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేదన్నారు. పరిష్కారం చూపేవాళ్లను అడ్డుకోవడం మంచి పద్దతి కాదని.. ఎంత అడ్డుకున్నా సమస్యల పరిష్కారంలో మాత్రం వెనకడుగు వేయమని ప్రధాని స్పష్టం చేశారు. కొందరు ఎంపీల ప్రవర్తన బాధ కలిగిస్తోందని.. సాంకేతికతతో సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని మోడీ పేర్కొన్నారు. పేదలను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకొచ్చామని.. సామాన్యుడి ముంగిటకు పథకాలు తీసుకెళ్లామని ప్రధాని తెలిపారు. 16 వేలకు పైగా గిరిజన గ్రామాల్లో విద్యుత్ వెలుగులు నింపామని.. దేశ ప్రజల విశ్వాసం గెలుసుకున్నామని మోడీ అన్నారు. 

ALso REad: కాంగ్రెస్ హయాంలో దేశ ప్రగతి నాశనం.. 60 ఏళ్లలో మిగిలింది గుంతలే : రాజ్యసభలో మోడీ విమర్శలు

మారుమూల పల్లెలనూ అభివృద్ధి చేశామని.. కాంగ్రెస్ 4 దశాబ్ధాలకు పైగా గరీబీ హఠావో నినాదంతోనే కాలం వెళ్లబుచ్చిందని ప్రధాని చురకలంటించారు. అసలైన లౌకికతత్వం అంటే ఏంటో తామే చూపించామని .. వివక్ష లేకుండా అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందేలా చేశామని మోడీ తెలిపారు. సామాన్యుడి సంక్షేమమే తమ ప్రాధాన్యత అని..  తమ పాలనలో 25 కోట్ల గ్యాస్ కనెక్షన్లు అందించామని ఆయన చెప్పారు. తొలిసారిగా తాము ఆదివాసీల కోసం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేశామని మోడీ వెల్లడించారు. ఆదివాసీల కోసం ఐదు రెట్లు నిధులు ఎక్కువగా ఖర్చు చేశామని ప్రధాని పేర్కొన్నారు. 

ఆదివాసీల కోసం బడ్జెట్‌లో 1.20 లక్షల కోట్లు కేటాయించామని మోడీ చెప్పారు. అందరి కోసం పనిచేయడమే అసలైన లౌకికతత్వమని ప్రధాని వెల్లడించారు. 60 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ గుంతలను మాత్రమే తవ్విందని.. ఆ పార్టీ ఇప్పుడు తన పాపాలకు శిక్షను అనుభవిస్తోందని ప్రధాని చురకలంటించారు. సన్న, చిన్నకారు రైతులపైనే దేశ ప్రగతి ఆధారపడి వుంటుందని మోడీ స్పష్టం చేశారు. ఆరు దశాబ్ధాల కాంగ్రెస్ పాలన శుద్ధ దండుగ అని.. యూపీఏ పాలనను తాను నిశితంగా పరిశీలించానని ఆయన తెలిపారు. ఇతర దేశాలు అభివృద్ధి చెందితే, భారత్‌ను కాంగ్రెస్ నాశనం చేసిందని మోడీ స్పష్టం చేశారు. 
 

click me!