బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ముగ్గురు దుర్మరణం, నలుగురికి తీవ్ర గాయాలు..

By Sumanth KanukulaFirst Published May 16, 2023, 3:09 PM IST
Highlights

పశ్చిమ బెంగాల్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తూర్పు మిడ్నాపూర్ జిల్లాలో ఓ బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. 

పశ్చిమ బెంగాల్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తూర్పు మిడ్నాపూర్ జిల్లాలో ఓ బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ఘటనకు సంబంధించి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. వివరాలు.. తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని ఎగ్రా వద్ద ఓ బాణసంచా ఫ్యాక్టరీలో మంగళవారం పేలుడు చోటుచేసుకుంది. పేలుడు ధాటికి అగ్నిమాపక కర్మాగారం నడుస్తున్న ఇళ్లు పూర్తిగా కూలిపోయింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకురావడంతో పాటు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా.. నలుగురు గాయపడినట్టుగా అధికారులు చెబుతున్నారు. గాయపడిన నలుగురిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.అయితే సహాయక చర్యలు పూర్తయిన తర్వాత మరిన్ని మృతదేహాలు లభ్యమయ్యే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. 

ఈ పేలుడు కేవలం అక్కడ నిల్వ ఉంచిన పటాకుల వల్ల జరిగిందా? లేదా బాణసంచా ఫ్యాక్టరీలో తయారు చేసిన ముడి బాంబులు పేలడం వల్ల జరిగిందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక, అవసరమైన అనుమతి లేకుండా బాణసంచా ఫ్యాక్టరీ పూర్తిగా అక్రమ పద్ధతిలో నడుస్తోందని స్థానికులు ఆరోపించారు.ఈ ప్రాంతంలోని అక్రమ బాణసంచా ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకోవాలని పదే పదే విజ్ఞప్తి చేసినా స్థానిక యంత్రాంగం పట్టించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు.

click me!