
ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో పలు చోట్ల నదులు ఉగ్రరూపం దాల్చాయి. కొన్ని చోట్ల షాపులు, కారులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. మరోవైపు పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో అనేక రోడ్లు, నివాస ప్రాంతాలు మోకాళ్ల లోతు నీటిలో మునిగిపోయాయి. ఇందుకు సంబంధించి పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మొత్తంగా వర్షాలకు సంబంధించిన సంఘటనలలో 19 మంది మరణించారు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా ముంపునకు గురైన రహదారులపై వాహనాలు కాగితపు పడవల్లా తేలియాడుతున్నాయి. పలుచోట్ల నివాస ప్రాంతాలు, దేవాలయాలు, ఇతర నిర్మాణాలలోకి బురద నీరు ప్రవహించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్, లడఖ్ , హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. అయితే ఢిల్లీలో 1982 తర్వాత జూలైలో ఒక్కరోజులో అత్యధిక వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారి. మరోవైపు యమునా నది నీటి మట్టం పెరగడంతో అధికారులు హెచ్చరికలు జారీచేస్తున్నారు.
గత 24 గంటల్లో ఢిల్లీలో 153 మిల్లీమీటర్ల వర్షం పడగా.. చండీగఢ్, హర్యానాలోని అంబాలాలో వరుసగా 322.2 మిమీ, 224.1 మిమీ వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ (ఎంఐడీ) తెలిపింది. హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్‌లో ఆదివారం 135 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని.. 1971లో ఒక రోజులో 105 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. ఇప్పుడు 50 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిందని సిమ్లా వాతావరణ శాఖ డైరెక్టర్ సురేందర్ పాల్ తెలిపారు.
భారీ వర్షాలతో సాధారణ జీవితం స్తంభించిపోవడంతో ఢిల్లీలోని పాఠశాలలతో పాటు, గురుగ్రామ్, నోయిడాలోని పాఠశాలలను సోమవారం మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఘజియాబాద్‌లో వర్షాల కారణంగా మరో రెండు రోజులు పాఠశాలలు మూసివేయనున్నారు. ఆ తర్వాత ‘‘కన్వర్ యాత్ర’’ కారణంగా జూలై 17 వరకు మూసివేయబడతాయి.
భారీ వర్షాలు, వరదలతో రైల్వే సర్వీసులు కూడా దెబ్బతిన్నాయి. దాదాపు 17 రైళ్లను రద్దు చేశామని, మరో 12 రైళ్లను దారి మళ్లించామని, నీటి ఎద్దడి కారణంగా నాలుగు చోట్ల ట్రాఫిక్‌ను నిలిపివేసినట్లు ఉత్తర రైల్వే తెలిపింది. హిమాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడిన మూడు వేర్వేరు సంఘటనలలో ఐదుగురు మరణించారు. ఇక, అక్కడ 10 జిల్లాలకు అత్యంత భారీ వర్షాల రెడ్ అలర్ట్ జారీ చేయబడింది.
సిమ్లా జిల్లాలోని కోట్‌ఘర్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో ఇల్లు కూలిన ఘటనలో ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి చెందగా, కులు, చంబా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. సిమ్లా నగర శివార్లలోని రాజహనా గ్రామంలో వర్షపు నీటికి భారీ మొత్తంలో చెత్తాచెదారం తన ఇంటిపై పడటంతో ఒక బాలిక మరణించింది. శిథిలాల కింద వృద్ధురాలు చిక్కుకుపోయిందని.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
హిమాచల్ ప్రదేశ్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ప్రకారం.. గత 36 గంటల్లో పద్నాలుగు పెద్ద కొండచరియలు, 13 ఆకస్మిక వరదలు సంభవించాయి. 700 రోడ్లు మూసివేయబడ్డాయి. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం సోమవారం, మంగళవారం రెండు రోజుల పాటు రాష్ట్రానికి అనుబంధంగా ఉన్న అన్ని పాఠశాలలు, కళాశాలలను మూసివేస్తున్నట్టుగా తెలిపింది.
ఉత్తరాఖండ్‌లో రిషికేశ్-బద్రీనాథ్ జాతీయ రహదారిపై గులార్ సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో జీప్ నదిలో పడిపోవడంతో ముగ్గురు యాత్రికులు గల్లంతయ్యారు. జీపులో 11 మంది ఉన్నారని రాష్ట్ర విపత్తు స్పందన దళం, పోలీసు అధికారులు తెలిపారు. ఐదుగురిని రక్షించామని, మరో ముగ్గురి కోసం వెతుకులాట కొనసాగుతోందని.. మూడు మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీసినట్లు చెప్పారు. రాష్ట్రంలోని కాశీపూర్ ప్రాంతంలో రెండు ఇళ్లు కూలి దంపతుల మృతి చెందగా, వారి మనవరాలికి గాయాలయ్యాయి.
జమ్మూ కాశ్మీర్‌లో దోడా జిల్లాలో ప్రయాణీకుల బస్సుపై కొండచరియలు పడటంతో.. ఇద్దరు వ్యక్తులు మరణించారు. లడఖ్‌లోని కార్గిల్ జిల్లాలో లేహ్-శ్రీనగర్ జాతీయ రహదారిపై వాహనంపై బండరాయి పడటంతో ఒక వ్యక్తి మరణించాడు. పూంచ్ జిల్లాలో శనివారం డోగ్రా నల్లా దాటుతుండగా ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయిన ఇద్దరు సైనికుల మృతదేహాలను వెలికితీశారు.
అయితే శ్రీనగర్‌లో భారీ వర్షాల నుంచి కొంత ఉపశమనం లభించింది. మూడు రోజుల విరామం తర్వాత పంజ్‌తర్ని, శేషనాగ్ బేస్ క్యాంపుల నుంచి అమర్‌నాథ్ పుణ్యక్షేత్రానికి యాత్ర ఆదివారం తిరిగి ప్రారంభమైంది. జమ్మూ కాశ్మీర్‌తో పాటు లడఖ్‌లోని ఎత్తైన ప్రాంతాల్లో మంచు కురుస్తుంది. అక్కడ భారీ వర్షాల కురిసే అవకాశం ఉండటంతో రెడ్ అలర్ట్ జారీ చేయబడింది. నదులు, వాగుల్లో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరిందన్న నివేదికలతో జమ్మూ కాశ్మీర్‌లోని కథువా, సాంబా జిల్లాలతో పాటు దిగువ పరివాహక ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్, స్పితిలోని చంద్రతాల్‌లో దాదాపు 200 మంది ప్రజలు చిక్కుకుపోయారు. చండీగఢ్-మనాలి హైవేలో కొంత భాగం బియాస్ నది నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. ఉత్తరాఖండ్‌లోని పర్వత ప్రాంతాలలోని పలు గ్రామాలకు రహదారులు దెబ్బతిన్నాయి.
భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్‌లో మనాలిలో షాప్‌లు కొట్టుకుపోయినట్లు, కులు, కిన్నౌర్, చంబాలోని నుల్లా వద్ద ఆకస్మిక వరదలలో వాహనాలు కొట్టుకుపోయినట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. పంజాబ్, హర్యానాలోని అనేక ప్రాంతాలలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక, గురుగ్రామ్ జిల్లాలోని గైరత్‌పూర్ బాస్ గ్రామంలో భారీ వర్షాల సమయంలో ఒక వ్యక్తి చెరువులో మునిగిపోయాడు. మరొకరి కోసం అన్వేషణ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
భారీ వర్షాలకు స్పందించిన ఢిల్లీ ప్రభుత్వం సోమవారం అన్ని పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది మరియు ప్రభుత్వ అధికారుల ఆదివారం సెలవులను రద్దు చేసింది, వారిని రంగంలోకి దింపింది. జలమయమైన రోడ్ల గుండా ప్రజలు వెళ్లడం, వాహనాలు చిక్కుకోవడం మరియు అండర్‌పాస్‌లు జలమయం కావడంతో ట్రాఫిక్ కష్టాలకు దారితీసింది.
ఉత్తరప్రదేశ్‌లో వర్షాల కారణంగా కౌశాంబిలోని తన ఇంటి టిన్ షెడ్‌పై చెట్టు కొమ్మ పడిపోవడంతో 10 ఏళ్ల బాలిక మరణించింది. ముజఫర్‌నగర్‌లో భారీ వర్షం కారణంగా ఇంటి పైకప్పు కూలి ఓ మహిళ, ఆమె ఆరేళ్ల కుమార్తె మృతి చెందారు. బల్లియాలో శనివారం రోజుకు పిడుగుపాటుకు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు.ఇక, రాజస్థాన్‌లో కొన్ని ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడగా.. చాలా ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిశాయి.