టమాటా వ్యాపారికి బౌన్సర్లు వార్తలో నిజం లేదు.. క్షమాపణలు చెప్పిన పీటీఐ..

Published : Jul 10, 2023, 08:51 AM IST
టమాటా వ్యాపారికి బౌన్సర్లు వార్తలో నిజం లేదు.. క్షమాపణలు చెప్పిన పీటీఐ..

సారాంశం

టమాటా వ్యాపారి బౌన్సర్లను పెట్టుకున్నాడంటూ ప్రసారం చేసిన వార్తల్లో నిజం లేదని.. క్షమించాలని పీటీఐ కోరింది. ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది.  

వారణాసి : దేశంలో పెరుగుతున్న టమాటా ధరల నేపథ్యంలో అనేక వార్తా కథనాలు వెలుగు చూస్తున్నాయి.  టమాటా దొంగతనాలతో సహా.. టమాటాలు లేకుండా వంటకాలు ఎలా చేయాలి.. రెస్టారెంట్లు టమాటాలను ఎలా అవాయిడ్ చేస్తున్నాయి.. ఇలాంటి అనేక కథనాలు వెలుగులోకి వస్తున్నాయి.  ఈ నేపథ్యంలో జాతీయ మీడియాలో టమాటాలకు సంబంధించి ఓ వార్త ఆదివారం హల్చల్ చేసింది.

ఓ టమాటాల వ్యాపారి టమాటాలను కాపాడుకోవడం కోసం బౌన్సర్లను నియమించుకున్నట్లుగా  పీటీఐ  వార్తా కథనాన్ని  ప్రసారం చేసింది. దీన్ని అనుసరించి అన్ని మీడియాలు ఈ కథనాన్ని ప్రముఖంగా ప్రచురించాయి. అయితే, ఇది తప్పుడు వార్త అని పీటీఐ ఇప్పుడు నాలుక కరుచుకుంది. ఆ వార్తలోని నిజానిజాలు తెలుసుకోవడంలో విఫలమయ్యామని.. క్షమించమని  కోరింది.

ఈ మేరకు మొదట తాము చేసిన ట్వీట్ ను డిలీట్ చేసినట్టుగా తెలుపుతూ.. మరో ట్వీట్ చేసింది. ఇలాంటి వార్తని తాము ప్రసారం చేసినందుకు క్షమించాలని కోరింది. ఆ వార్తలో నిజం లేదని తెలిపింది. ఆ టమాటాల షాపు ఓనరు సమాజ్ వాది పార్టీ కార్యకర్త అని గుర్తించినట్లుగా తెలిపింది. అయితే, ఇలా ఫోటో వెనక అతని ఉద్దేశ్యం ఏమిటో ప్రశ్నార్థకంగా ఉందని చెప్పుకొచ్చింది.

పీటీఐ ఎల్లప్పుడూ ఉన్నత ప్రమాణాలను చేరడంలో కృషి చేస్తుందని.. ఈసారి తప్పు జరిగిందని పేర్కొంది. ఉన్నత విలువలతో కూడిన నిష్పాక్షికమైన వార్తలను అందించడానికి పీటీఐ కట్టుబడి ఉన్నట్లుగా  హామీ ఇస్తున్నట్లు ట్వీట్ లో తెలిపింది. 

దేశంలో టమాటాల ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో.. ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సామాన్య జనం టమాటా కొనడానికి విముఖత చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు సబ్సిడీ మీద టమాటాలను అందించడం కూడా  తెలిసిందే. 


 

PREV
click me!

Recommended Stories

బెస్ట్ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? | CS Sharma | Access Career Counselors | Asianet News Telugu
MBA, PGDM.. ఏది చదివితే కెరీర్ బాగుంటుంది?| CS Sharma | Access Career Counselors| AsianetNews Telugu