
కర్ణాటకలోని బెలగావి జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరికొందరికి గాయాలు కాగా.. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను Belagavi district గోకాక్ తాలూకాలోని అక్కాతంగియార హల్లా గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. ఆదివారం ఉదయం కూలీలతో వెళ్తున్న వాహనం.. Kalyal బ్రిడ్జి వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడి చేరుకని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సాయంతో వాహనం కింద ఉన్న వారిని బయటకు తీశారు. గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించారు. బెలగావి పోలీస్ కమిషనర్ ఎంబీ బోరలింగయ్య కూడా ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్కాతంగియార హల్లా గ్రామానికి చెందినవారు కూలి పని నిమిత్తం బెలగావికి వెళ్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో మొత్తం 18 మంది కూలీలు ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మణం చెందారు. మిగిలినవారికి గాయాలు కాగా.. అందులో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది.
కూలీలతో వెళ్తున్న వాహనం డ్రైవర్.. మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఇక, మృతులను అడివెప్ప చిలంబావి (27), బసవరాజ్ దళవి (30), బసవరాజ్ హనుమన్నవర (51), ఆకాశ గస్తీ (22), ఫకీరప్ప హరిజన (55), మల్లప్ప దాసనశెట్టి (30), బసవరాజ సనాది (35)గా గుర్తించారు.