Republic Day:ఇంటెలిజెన్స్ అలర్ట్.. గణతంత్ర వేడుకల్లో ఉగ్ర దాడికి కుట్ర.. ప్రధాని మోడీకి ముప్పు!

By Mahesh KFirst Published Jan 18, 2022, 11:21 AM IST
Highlights

భారత గణతంత్ర దినోత్సవ వేడుకలపై కొన్ని ఉగ్రవాద సంస్థలు దాడులు చేయాలని కుట్రలు చేస్తున్నట్టు నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఈ వేడుకల్లో హాజరుకాబోతున్న ప్రధాని నరేంద్ర మోడీ సహా ఇతర దేశాల అతిథులనూ లక్ష్యం చేసుకుని బీభత్సం సృష్టించే ప్రమాదం ఉన్నదని తెలిసింది. ప్రధాని మోడీ, ప్రసిద్ధ కట్టడాలు, జనాలు రద్దీగా ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉన్నదని సమాచారం. ఇంటెలిజెన్స్‌కు అందిన సమాచారం మరికొన్ని విషయాలను వెల్లడిస్తున్నది.

న్యూఢిల్లీ: భారత్ ఘనంగా నిర్వహించే వేడుకలపై ఉగ్రవాదుల కన్ను ఎప్పుడూ ఉంటుంది. ముఖ్యంగా స్వాతంత్ర్య దినోత్సవాలు, గణతంత్ర దినోత్సవాల(Republic Day Celebrations)ను ఆటంక పరచాలనే వక్రబుద్ధి ఏళ్లుగా ఉగ్రవాద సంస్థల్లో కొనసాగుతున్నది. ఈ సారి కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలను టార్గెట్(Target) చేసుకుని ఉగ్ర బీభత్సం(Terror Threat) చేయాలని కుట్ర పన్నినట్టు నిఘా వర్గాలకు హెచ్చరికలు వచ్చినట్టు తెలిసింది. ఈ వేడుకలకు హాజరయ్యే ప్రధాని మోడీ సహా ఇతర దేశాల నుంచి వచ్చిన అతిథులపైనా దాడి చేసే కుట్రలు జరుగుతున్నట్టు సమాచారం. ఇంటెలిజెన్స్‌(Intelligence)కు వచ్చిన కొన్ని హెచ్చరికలను ఓ మీడియా సంస్థ పరిశీలించింది. 

75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఉగ్రవాదులు లక్ష్యం చేసుకున్నట్టు ఇంటెలిజెన్స్‌కు వచ్చిన సమాచారం తెలుపుతున్నది. అంతేకాదు, ఆ వేడుకల్లో పాల్గొనబోతున్న ప్రధాని మోడీ సహా ఇతర ప్రముఖులనూ టార్గెట్ చేసుకున్నట్టు తెలుస్తున్నది. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు కజక్‌స్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల నేతలు ముఖ్య అతిథులుగా హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయి. పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్ రీజియన్‌లో ప్రాబల్యం ఉన్న ఉగ్రవాద గ్రూపుల నుంచి ఈ ముప్పు ఉన్నట్టు ఆ హెచ్చరికలు వెల్లడించాయి.

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో హాజరయ్యే ప్రముఖులతోపాటు ప్రజా సముదాయంపైనా, కీలక కట్టడాలపైనా, జనసమ్మర్ధమైన ప్రాంతాలపైనా ఉగ్రవాదులు ఫోకస్ చేయనున్నట్టు తెలిసింది. ఈ దాడులను డ్రోన్‌ల సహాయంతోనూ చేపట్టే అవకాశాలు ఉన్నాయని సమాచారం. లష్కర్ ఎ తాయిబా, ది రెసిస్టెన్స్ ఫోర్స్, జైషే మొహమ్మద్, హర్కత్ ఉల్ ముజాహిదీన్, హిజ్బుల్ ముజాహిదీన్‌లు ఈ ఉగ్ర కుట్రల వెనుక ఉన్నట్టు నిఘా వర్గాలకు అందిన సమాచారం. అంతేకాదు, పాకిస్తాన్‌లోని ఖలిస్తానీ గ్రూపులు పంజాబ్‌లో వేళ్లూనుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. పంజాబ్‌‌కు క్యాడర్‌ను పంపి అక్కడ మిలిటెన్సీని పెంచాలని యోచిస్తున్నట్టు సమాచారం వచ్చింది. అంతేకాదు, పంజాబ్‌ సహా ఇతర రాష్ట్రాల్లోనూ వారు లక్షిత దాడులకు పాల్పడటానికి ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలిసింది. 2021 ఫిబ్రవరిలో ఇంటెలిజెన్స్‌కు అందిన సమాచారం ప్రకారం ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థలు ప్రధాని మోడీ సమావేశాలు, టూర్‌లపై దాడులు చేయాలని ప్లాన్‌లు వేస్తున్నాయి.

పంజాబ్‌(Punjab) పర్యటనలో భద్రతా లోపం(Security Lapse) వల్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) 20 నిమిషాల పాటు ఓ ఫ్లై ఓవర్‌పై నిలిచిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత తన పర్యటనను రద్దు చేసుకుని అక్కడి నుంచి వెనక్కి రావల్సి వచ్చింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది.ప్రధాని పర్యటనలో ఆయన భద్రతా లోపంలో తమ బాధ్యత లేదని పంజాబ్ ప్రభుత్వం తెలిపింది. చివరి నిమిషంలో రూట్ మార్చారని పేర్కొంది. ఆ ఘటనను బీజేపీ చిత్రిస్తున్న విధానం చూస్తే.. తమ రాష్ట్రాన్ని అప్రదిష్టపాలు చేసే కుట్రగా స్పష్టం అవుతున్నదని పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్ని అన్నారు. అంతేకాదు, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడానికే ఈ ఘటనను ఉపయోగించుకుంటున్నట్టు తెలుస్తున్నదని పేర్కొన్నారు. తాము ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని చంపడానికి కాచుక్కూర్చున్నట్టుగా మాట్లాడారని పేర్కొన్నారు.

click me!