స్వాతంత్య్ర భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగంలో కీలక మైలురాళ్ళు ఇవే..

By Sumanth KanukulaFirst Published Aug 7, 2022, 7:17 PM IST
Highlights

భారతదేశం శాస్త్రీయ దృఢత్వం, సామర్థ్యానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అన్నింటికంటే ముఖ్యంగా భారత్ ఆయుర్వేద భూమిగా గుర్తింపు సొంతం చేసుకుంది. వాతావరణం పరిస్థితుల పట్ల సున్నితత్వం ప్రదర్శించే భారత్.. మరోవైపు పోఖ్రాన్-II వంటి విజయవంతమైన అణు పరీక్షలు నిర్వహించింది.

భారతదేశం శాస్త్రీయ దృఢత్వం, సామర్థ్యానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అన్నింటికంటే ముఖ్యంగా భారత్ ఆయుర్వేద భూమిగా గుర్తింపు సొంతం చేసుకుంది. వాతావరణం పరిస్థితుల పట్ల సున్నితత్వం ప్రదర్శించే భారత్.. మరోవైపు పోఖ్రాన్-II వంటి విజయవంతమైన అణు పరీక్షలు నిర్వహించింది. సీవీ రామన్, అన్నా మణి.. వంటి సైన్స్ లెజెండ్స్ భారత గడ్డపై జన్మించారు. అయితే స్వాతంత్య్రానంతరం మాత్రమే భారతదేశం శాస్త్రీయ ఆవిష్కరణలో వేగం పుంజుకోగలిగిందని చెప్పాలి. మరి స్వాతంత్ర్యం తర్వాత భారతదేశం సాధించిన కీలక శాస్త్ర సాంకేతిక మైలురాళ్ళని సాధించింది. ఒకసారి వాటిని పరిశీలిస్తే.. భారత్ తన నైపుణ్యాలు, వనరులను వ్యూహాత్మకంగా సమీకరించడం ద్వారా ఈ ఆవిష్కరణ రంగాలలో భారీ మార్పును చూసింది.

వ్యవసాయం, సైన్స్, మౌలిక సదుపాయాలు, విద్య వంటి కీలక రంగాలలో తీసుకోవలసిన చర్యలను రూపొందించడం, ప్రణాళిక చేయడం.. వంటి లక్ష్యంతో 1950లో ప్రణాళిక సంఘం ఏర్పాటు చేయబడింది. దేశంలో మొట్టమొదటి ప్రణాళిక ముసాయిదా జూలై 1951లో సమర్పించబడింది.  ఇది శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన'పై ప్రత్యేక అధ్యాయాన్ని కలిగి ఉంది. తద్వారా దేశంలో శాస్త్రీయ పరిశోధనలకు పునాది వేయడానికి ప్రాధాన్యత దక్కింది. జాతీయ ప్రయోగశాలలు, పరిశోధనా కేంద్రాలను నిర్మించడం, మెరుగుపరచడం వంటి కార్యక్రమాలపై ఎక్కువగా దృష్టి సారించారు. 

ఇది జాతీయ స్థాయిలో పదకొండు పరిశోధనా సంస్థలను గుర్తించింది. అలాగే దేశ భవిష్యత్తు అభివృద్ధిలో వాటి ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. వీటిలో నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ ఆఫ్ ఇండియా (ఢిల్లీ), నేషనల్ కెమికల్ లాబొరేటరీ (పూణే, మహారాష్ట్ర), మరియు సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (కరైకుడి, తమిళనాడు) వంటివి ఉన్నాయి. ఆ తర్వాత రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సెంట్రల్ సాల్ట్ రీసెర్చ్ స్టేషన్‌లకు కూడా ప్రతిపాదనలు జరిగాయి. 

అంతరిక్ష రంగంలో భారత్ సహకారం అపారమైనదనే చెప్పాలి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 1969లో భారతదేశ జాతీయ అంతరిక్ష సంస్థగా పనిచేయడానికి స్థాపించబడింది. మొట్టమొదటి భారతీయ ఉపగ్రహం 'ఆర్యభట్ట'. ఇది భారతదేశంలో రూపొందించబడింది. 1975 ఏప్రిల్ 19న ప్రయోగించబడింది. X-రే ఖగోళ శాస్త్రం, ఏరోనమీ, సౌర భౌతిక శాస్త్రాన్ని అమలు చేయడానికి ISRO ఆర్యభటను అభివృద్ధి చేసింది.

1989లో అగ్నిని విజయవంతంగా పరీక్షించడంతో భారతదేశం 1980వ దశకంలో వ్యూహాత్మక క్షిపణి వ్యవస్థలను విజయవంతంగా అభివృద్ధి చేసింది. తర్వాత భారత శాస్త్రవేత్తలు క్రమంగా.. రీ-ఎంట్రీ, నియంత్రణ, మార్గదర్శకత్వం, రెండు-దశల ప్రొపల్షన్, దశల విభజన వంటి సామర్థ్యాలను ప్రదర్శించగలిగారు. అప్పటి నుంచి.. భారత్ అనేక క్షిపణి వ్యవస్థలను సృష్టించి, పరీక్షించి అమలు చేసింది. ఇక, అగ్ని-V‌ను  2018లో విజయవంతంగా పరీక్షించబడింది.

భారతదేశంలో డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్.. 1988లో ఉనికిలోకి వచ్చింది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్-సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CSIR-CCMB) శాస్త్రవేత్తలు ఈ సాంకేతికతను అభివృద్ధి చేసి.. ఉపయోగం కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో భారత డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ అభివృద్ధి చేసిన మూడవ దేశంగా నిలిచింది. 

ఇక, 1998 మే 11న రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో భారతదేశం ఐదు అణు బాంబులను భూగర్భంలో విజయవంతంగా పరీక్షించింది. ఈ పరీక్షలకు పోఖ్రాన్-II అని పేరు పెట్టారు. శాస్త్ర సాంకేతిక రంగంలో భారత దేశం సాధించిన విజయాలను.. భారత శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు సాధించిన సాంకేతికపరమైన విజయాలను గుర్తుచేసుకోవడాని ప్రతి ఏడాది మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవం జరుపుకుంటున్నాం. 1999లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి దీనికి శ్రీకారం చుట్టారు. 

భారత్‌ మూన్ మిషన్‌‌లో భాగంగా.. 2008 అక్టోబర్ 22న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి చంద్రయాన్-1 ప్రయోగం చేపట్టింది. చంద్రయాన్‌ ప్రయోగం విజయవంతం కావడంతో చంద్రుడి ఉపరితలంపై కాలిడిన నాలుగో దేశంగా భారత్‌ అవతరించింది. రసాయన, ఫోటో జియోలాజికల్,  మినరలాజికల్ మ్యాపింగ్‌లను ఇస్రోకు అందించడానికి ఈ అంతరిక్ష నౌక చంద్రుని చుట్టూ తిరుగుతుంది.

1994లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పోలియో కేసుల్లో దాదాపు 60 శాతం భారతదేశంలోనే నమోదయ్యాయి. ప్రభుత్వం ప్రతి బిడ్డకు టీకాలు వేయడానికి చేసిన ప్రత్యేక చొరవ వల్ల.. రెండు దశాబ్దాలలో భారత్‌ పోలియో రహితంగా మారేలా చేసింది. భారతదేశం.. 2014 మార్చి 27  ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ‘పోలియో రహిత’ ధృవీకరణను పొందింది. బలమైన విధానం, నిబద్ధతతో కూడిన ఆరోగ్య సంరక్షణ నిపుణులు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, కమ్యూనిటీ వర్కర్ల కారణంగా ఈ ఇమ్యునైజేషన్ డ్రైవ్ విజయవంతమైంది. 

మార్స్ ఆర్బిటర్ మిషన్‌కు భారత్ శ్రీకారం చుట్టింది. 2013 నవంబర్ 5వ తేదీన మార్స్ ఆర్బిటర్ మిషన్‌ తొలి ప్రయోగం మంగళ్ యాన్-1ను అంతరిక్షంలోకి ప్రయోగించారు. 2014 సెప్టెంబర్ 24వ తేదీన ఇది అంగారక గ్రహం కక్ష్యలోకి ప్రవేశించింది. అంగారకుడిపై తొలి ప్రయోగం విజయవంతమైన తర్వాత రెండో దఫా ప్రయోగం కోసం అవకాశాలను ఇస్రో అన్వేషిస్తోంది.

భారతదేశంలో స్వదేశీ శాస్త్ర, సాంకేతిక, వినూత్న అభివృద్ధిని ప్రోత్సహించేందుకు.. కేంద్రం ప్రభుత్వం  2016న జనవరి 16న ‘స్టార్టప్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అప్పటి నుండి, భారతీయ స్టార్టప్‌ల సంఖ్య పెరుగుతోంది. 2021 జూలై నాటికి దేశంలో 52,000 కంటే ఎక్కువ స్టార్టప్‌లు ఉన్నాయి. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్ట్-అప్ పర్యావరణ వ్యవస్థలలో ఒకటిగా నిలిచింది. ఈ స్టార్టప్‌ల వల్ల 5 లక్షలకు పైగా ఉద్యోగాల కల్పన జరిగింది. 

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తలపెట్టిన మరో కీలక ప్రయోగం గ‌గ‌న్‌యాన్‌యాన్. త్వ‌ర‌లో ఇస్రో మాన‌వ స‌హిత ఉప‌గ్ర‌హం గ‌గ‌న్‌యాన్‌ను పంపేందుకు స‌న్నాహాలు చేస్తోంది. భూమికి అతి త‌క్కువ ఎత్తులో వ్యోమ‌గాముల‌ను తీసుకెళ్లే ల‌క్ష్యంతో ఈ ఉప‌గ్ర‌హ ప్ర‌యోగం జ‌రుగ‌నుంది. మాన‌వ స‌హిత ఉప‌గ్ర‌హాన్ని ఇస్రో ప్ర‌యోగించ‌నుండ‌టం ఇదే తొలిసారి. 

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి పరిశోధనలో భారతదేశం ముందంజలో నిలిచింది. COVID-19 వ్యాక్సిన్‌ల అతిపెద్ద తయారీదారులు, ఎగుమతిదారులలో ఒకటిగా అవతరించింది. 2021 చివరి నాటికి.. భారతదేశం 90 కంటే ఎక్కువ దేశాలకు 7 కోట్లకు పైగా కోవిడ్ వ్యాక్సిన్ డోస్‌లను సరఫరా చేసింది. 
 

click me!