
Video Viral: పిల్లలు భగవంతుని స్వరూపం అని అంటారు. వారికి పేద, ధనిక, చిన్న, పెద్ద అనే తేడా ఉండదు. అలాంటి తారతామ్యాలు కూడా వారికి తెలియదు. మనసులో ఇసుమంత కూడా కల్మషం లేకుండా వారు చేసే పనులకు ఎవరైనా ఫిదా కావాల్సిందే.. తాజాగా ఓ స్కూల్ విద్యార్ధిని తన టిఫిన్ బాక్స్ లోని ఫుడ్ ను బిచ్చగాడికి తినిపించింది. ఇందుకు సంబంధించిన నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ చిన్నారి దయాగుణానికి నెటిజన్లందరూ ఫిదా అయిపోయారు.
వివరాల్లోకెళ్తే.. సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. కానీ కొన్ని వీడియోలు మాత్రమే మన హృదయాన్ని టచ్ చేస్తాయి. అలాంటి వీడియోనే ఇది. queen_of_valley అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేరైన వీడియో అందరి హృదయాన్ని కదిలించింది. ఈ వీడియోలో మొదట ఓ చిన్నారి బిచ్చగాడికి కొంత డబ్బును ఇస్తున్నట్టు చూడొచ్చు. ఆ తరువాత..ఆ చిన్నారి తన టిఫిన్ బాక్స్ తెరిచి.. అందులో నుంచి శాండ్విచ్ అతని చేతికి ఇస్తుంది. కానీ ఆ బిచ్చగాడు సంకోచిస్తున్నట్లు అనిపించాడు. వెంటనే ఆ చిన్నారి తన చేత్తో అతనికి శాండ్ విచ్ తినిపించింది. ఈ క్యూట్ వీడియో చివర్లో.. ఆ చిన్నారి బిచ్చగాడితో షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది.
ఈ క్లిప్‌ని చూసిన జనాలు భావోద్వేగానికి లోనయ్యారు.వీడియోపై లైక్స్, రియాక్షన్స్ వెల్లువెత్తాయి. చాలా మంది నెటిజన్లు ఆ చిన్నారి దయగుణానికి ముగ్దులయ్యారు. ఆ చిన్నారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియోను పోస్ట్ చేసినప్పటి నుండి 1 మిలియన్ కంటే ఎక్కువ సార్లు వీక్షించారు. అదే సమయంలో 212k లైక్‌లు వచ్చాయి. 'ఆమె తల్లి ఒక యువరాణిని పెంచింది' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. మరొకరు ' ఆమె చేయి పట్టుకుని ఆహారం తినిపిస్తుంటే.. ఓ దేవత వచ్చినట్టుగా అనిపిస్తుంది' అని కామెంట్ చేశారు.