పెగాసెస్‌పై మమత సర్కార్ విచారణ కమిషన్: కేంద్రానికి , బెంగాల్ సర్కార్లకు సుప్రీం నోటీసులు

By narsimha lodeFirst Published Aug 18, 2021, 3:02 PM IST
Highlights

 పెగాసెస్ అంశంపై సుప్రీంకోర్టు కేంద్రానికి, బెంగాల్ ప్రభుత్వానికి బుధవారం నాడు నోటీసులు పంపింది. పెగాసెస్ పై విచారణకు  ఇద్దరు సభ్యులతో కూడిన కమిటీని మమత సర్కార్ నియమించింది. ఈ కమిటీ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా  సుప్రీంకోర్టు ఇవాళ నోటీసులు జారీ చేసింది.
 


న్యూఢిల్లీ:పెగాసెస్ అంశంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి, బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.పెగాసెస్ అంశంపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి బెంగాల్ సీఎం మమత బెనర్జీ  ఓ కమిటీని ఏర్పాటు చేసింది.  ఇధ్దరు సభ్యుల కమిటీ నియామకాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై బెంగాల్ ప్రభుత్వానికి కేంద్రానికి సుప్రీంకోర్టు ఇవాళ నోటీసులు జారీ చేసింది.

సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రం, రాష్ట్రాల నుండి ప్రతిస్పందనను కోరింది. ఈ నెల 25వ తేదీకి విచారణను వాయిదా వేసింది. పెగాసెస్ వివాదానికి సంబంధించిన ఇతర పిటిషన్లతో పాటు  విచారణ చేయనున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది.

పిటిషనర్ తరపున న్యాయవాది సౌరభ్ మిశ్రా వాదించారు. అధికార పరిధిని బట్టి కమిషన్ ను సవాల్ చేసినట్టుగా మిశ్రా చెప్పారు.  విచారణను నిలిపివేయడానికి కోర్టు నిరాకరించింది. బెంగాల్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీని రాజ్యాంగ విరుద్దమైందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభిప్రాయపడ్డారు.

పెగాసెస్ అంశంపై  ఈ ఏడాది జూలై 26న బెంగాల్ సీఎం మమత బెనర్జీ  ఇద్దరు సభ్యులతో కూడిన విచారణ కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్, కోల్‌కత్తా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జ్యోతిర్మయ్ భట్టాచార్యలు సభ్యులుగా ఉన్నారు.

click me!