
వరల్డ్ ఎర్త్ డే 2022 సందర్భంగా.. ‘‘ నమ్మ బెంగళూరు ఫౌండేషన్ (Namma Bengaluru Foundation) , మౌంట్ కార్మెల్ కాలేజ్ అటానమస్‌తో (Mount Carmel College Autonomous) కలిసి శుక్రవారం బెంగళూరులోని బాలేకుండ్రి సర్కిల్ కన్నింగ్‌హామ్ రోడ్‌లో “సేవ్ ఎర్త్, సేవ్ అవర్ ఫ్యూచర్” ప్రచారాన్ని (Save Earth, Save Our Future) నిర్వహించింది. ఈ ఏడాది 'ఇన్వెస్ట్ ఇన్ అవర్ ప్లానెట్ ' ఎర్త్ డే థీమ్‌తో (Invest in our Planet) 25 మందికి పైగా విద్యార్థులు, ప్రొఫెసర్లు ఈ ప్రచారంలో పాల్గొన్నారు. మాతృభూమి పట్ల మనకున్న కృతజ్ఞతను తెలియజేయడానికి, భూగోళంపై జీవావరణ శాస్త్రాన్ని గౌరవించాల్సిన , రక్షించాల్సిన అవసరాన్ని వారు తెలియజేశారు.
ఈ సందర్భంగా ‘‘సేవ్ ట్రీస్, సేవ్ ట్రీస్’’.. ‘‘గో గ్రీన్’’, ‘‘గో సైకిలింగ్’’, ‘‘స్విచ్ఛాఫ్ ఆఫ్ యువర్ ఇంజిన్ ఎట్ సిగ్నల్, సేవ్ ఫ్యూయెల్’’, ‘‘ప్లాస్టిక్‌ను ఉపయోగించడం మానండి’’, ‘‘సరస్సులను రక్షించండి ’’ వంటి నినాదాలతో కూడిన ప్లకార్డులు, బ్యానర్లను ప్రదర్శించారు. ఇదే సమయంలో సర్కిల్ వద్ద వున్న వాహనదారులు, ప్రజలు ఈ అవగాహనా కార్యక్రమాన్ని ఆసక్తిగా గమనించారు. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సమతుల్యతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఫౌండేషన్ ప్రతినిధుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇదే సమయంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వాహనదారులు తమ కారు లేదా బైక్ ఇంజిన్‌ను ఆఫ్ చేసి ఈ కార్యక్రమంలో మొదటి అడుగు వేయాలని విద్యార్ధులు అభ్యర్ధించారు.
సిగ్నల్ వద్ద వాహనాలను ఆపివేయడం వల్ల ఇంధనం, డబ్బు ఆదా అవ్వడమే కాకుండా పర్యావరణాన్ని కూడా కాపాడినట్లు అవుతోందని వారు తెలిపారు. వాహనాలు పర్యావరణంపై హానికరమైన ప్రభావాన్ని చూపుతాయని , వాయు కాలుష్యానికి గ్లోబల్ వార్మింగ్‌కు దోహదమవుతుందని విద్యార్ధులు తెలిపారు. తక్కువ దూరాలకు నడిచి వెళ్లడం, సైకిల్ తొక్కడం , ఎక్కువ దూరాలకు ప్రజా రవాణాను ఉపయోగించడం వంటి స్థిరమైన ప్రయాణ ప్రత్యామ్నాయాలను ఎంచుకునే ప్రయత్నం చేయాలని వారు సూచించారు.
నగరంలోని సరస్సులను, చెట్లను కాపాడాలని ప్రజలను వాలంటీర్లు ప్రోత్సహించారు. భూగర్భ జలాలను పునరుద్ధరించడంలో, వరదలను నివారించడంలో, వేసవి కాలంలో నీటిని నిల్వ చేయడంలో, పర్యావరణ వ్యవస్థను నిర్వహించడంలో సరస్సులు కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహించి ఆక్సిజన్‌ను సరఫరా చేస్తాయి. తద్వారా నగరాల్లో ప్రజల జీవితాలు సాఫీగా సాగుతాయని విద్యార్ధులు తెలియజేశారు.
మరికొందరు వాలంటీర్లు రాబోయే తరాలకు స్ధిరమైన భవిష్యత్‌ను అందించడానికి నిత్య జీవితంలో ప్రయత్నాలు చేయాలని పాదచారులు, వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. ప్లాస్టిక్‌ను తగ్గించడం అనేది అతి ముఖ్యమని.. పునర్వియోగం, రీసైకిలింగ్ చేసే ఉత్పత్తులను వినియోగించాలని కోరారు. ఈ గ్రహం మీద జీవించడానికి చెల్లించే ఏకైక జాతిగా .. మార్పు మనతోనే మొదల్వవాలని వాలంటీర్లు చెప్పారు. సువిశాల ప్రపంచంలో చిన్న చిన్న మార్పులు ఎంత గొప్ప ప్రభావాన్ని చూపిస్తాయో తెలియదని వ్యాఖ్యానించారు.