శరవణ భవన్ రాజగోపాల్ మృతి: మూడో పెళ్లి కోసం హత్యతో మసకబారిన ప్రతిష్ట

By Siva KodatiFirst Published Jul 18, 2019, 3:06 PM IST
Highlights

శరవణ భవన్ రాజగోపాల్ కన్నుమూశారు. దేశ విదేశాల్లో శరవణ భవన్ హోటల్స్‌తో ప్రఖ్యాతి గాంచిన ఆయన.. మూడో పెళ్లి కోసం హత్య చేయించడంతో ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. జైల్లోనే గుండెపోటుకు గురై రాజగోపాల్ మరణించారు. 

మూడో పెళ్లి కోసం ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో కీలక నిందితుడు చెన్నై శరవణ భవన్ యజమాని యజమాని పి. రాజగోపాల్ మృతి చెందాడు. మూడో వివాహం చేసుకోవడం కోసం ఓ వ్యక్తిని హత్య చేసిన రాజగోపాల్‌కు సుప్రీంకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

ఈ కేసులో జూలై 7న లొంగిపోవాల్సి వుండగా... అనారోగ్య కారణాలతో తనకు మరింత వ్యవధి ఇవ్వాల్సిందిగా సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరాడు. ఇందుకు కోర్టు ససేమిరా అనడంతో ఈ నెల 9న కోర్టులో లొంగిపోయారు.

అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న రాజగోపాల్.. ఆక్సిజన్ మాస్క్‌తో అంబులెన్స్‌లో వచ్చి మరి లొంగిపోయారు. దీంతో ఆయనను పుళల్ జైలుకు తరలించారు. శిక్ష అనుభవిస్తున్న సమయంలోనే రాజగోపాల్‌కు గుండెపోటు రావడంతో ఆయనను హుటాహుటిన స్టాన్లీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

అయితే పరిస్ధితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం కోర్టు అనుమతితో బుధవారం నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం రాజగోపాల్ కన్నుమూశారు.

శరవణ భవన్ పేరుతో దేశ విదేశాల్లో ఎన్నో రెస్టారెంట్లు ప్రారంభించి ఆ రంగంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన రాజగోపాల్‌కు జాతకాలు, ముహూర్తాలు వంటి వాటిపై నమ్మకం ఎక్కువ.

ఈ క్రమంలోనే తన దగ్గర పనిచేసే ఓ ఉద్యోగి కుమార్తెను మూడో భార్యగా చేసుకుంటే వ్యాపారంలో ఇంకా బాగా కలిసొస్తుందని జ్యోతిష్కుడు చెప్పడంతో దానిని ఆయన అనుసరించాడు.

అయితే అప్పటికే ఆమెకు వివాహం కావడంతో రాజగోపాల్‌ను పెళ్లి చేసుకోవడానికి ఆమె అంగీకరించలేదు. దీంతో ఆమెను ఎలాగైనా సొంతం చేసుకోవాలని పథకం పన్నాడు. దీనిలో భాగంగా 2001లో ఆమె భర్తను చంపించాడు.

ఈ కేసులో రాజగోపాల్‌తో పాటు మరికొందరిపైనా కేసు నమోదైంది. సుధీర్ఘకాలం పాటు మద్రాస్ హైకోర్టు ఈ కేసును విచారించింది... తొలుత 10 ఏళ్ల కారాగార శిక్ష విధించినప్పటికీ.. అనంతరం దానిని యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తూ 2009లో తీర్పు వెలువరించింది.

ఈ తీర్పును సవాల్ చేస్తూ రాజగోపాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడా ఆయనకు నిరాశే ఎదురైంది... సర్వోన్నత న్యాయస్థానం సైతం మద్రాస్ హైకోర్టు తీర్పును సమర్థించింది.

click me!