
ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్, అజంగఢ్ లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఆదివారం విడుదల అయ్యాయి. అయితే ఈ ఫలితాలపై ఎఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఈ ఎన్నికల ఫలితాలు బీజేపీని ఓడించలేని సమాజ్ వాదీ పార్టీ అసమర్థతను తెలియజేస్తోందని అన్నారు. ‘‘ బీజేపీని ఓడించే సత్తా సమాజ్‌వాదీ పార్టీకి లేదని, వారికి మేధో నిజాయితీ లేదని యూపీ ఉప ఎన్నికల ఫలితాలు చూపిస్తున్నాయి. అలాంటి అసమర్థ పార్టీలకు మైనారిటీ వర్గాలు ఓట్లు వేయకూడదు. బీజేపీ గెలుపునకు ఎవరు బాధ్యులు. ఇప్పుడు ఎవరు బీ టీమ్, సీ టీమ్ ’’ అని అన్నారు.
ఇండియాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య ఎంతుందో తెలుసా.. అన్ని భాషల్లో తెలుగు భాష స్థానం ఎంతంటే..!
రాంపూర్, అజంగఢ్ ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమికి ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కారణమని ఆరోపించారు. ‘‘ అఖిలేష్ యాదవ్‌కు చాలా అహంకారం ఉంది. ఆయన ప్రజలను కూడా కలువలేదు. దేశంలోని ముస్లింలు తమ సొంత రాజకీయ గుర్తింపును ఏర్పర్చుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో రాంపూర్, అజంగఢ్ లోక్‌సభ స్థానాల్లో అధికార బీజేపీ విజయం సాధించింది. రాంపూర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఘన్‌శ్యాం సింగ్ లోధి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి మహ్మద్ అసిమ్ రాజాపై విజయం సాధించగా, అజంగఢ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి దినేష్ లాల్ యాదవ్ నిరాహువా విజయం సాధించారు. అజంగఢ్ గుడ్డు జమాలిలో బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి గట్టి పోటీ ఇచ్చి మూడో స్థానంలో నిలిచారు. అయితే ఈ రెండు స్థానాలను సమాజ్‌వాదీ పార్టీ కంచుకోటలుగా భావించేవారు. అజంగఢ్, రాంపూర్ స్థానాలకు వరుసగా అఖిలేష్ యాదవ్, ఆజం ఖాన్ రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ శాసనసభకు ఎన్నికైన తర్వాత ఇద్దరు నేతలు లోక్‌సభ ఎంపీల పదవులకు రాజీనామా చేశారు.
అజంగఢ్, రాంపూర్ ఉప ఎన్నికల విజయాలు చారిత్రాత్మకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇది కేంద్రంలో, ఉత్తరప్రదేశ్‌లో డబుల్ ఇంజన్ ప్రభుత్వాలకు విస్తృత స్థాయి ఆమోదం, మద్దతును సూచిస్తోందని ప్రధాని మోదీ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. మద్దతిచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ కార్యకర్తల కృషిని కూడా ఆయన అభినందించారు. ఉప ఎన్నికల విజయం 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆశాజనక సందేశాన్ని పంపిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం అన్నారు. ‘‘ ఉప ఎన్నికల విజయం 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆశాజనక సందేశాన్ని పంపింది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వంపై ప్రజలు తమ విశ్వాసాన్ని ప్రదర్శించారు. ప్రజలు ‘పరివార్వాది’లకు, కులవాద, మతవాదులకు స్పష్టమైన సందేశం ఇచ్చారు.’’ అని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.