
రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ స్టాండ్‌పై క్లారిటీ వచ్చింది. టీఆర్ఎస్ మద్దతు విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మద్దతు ఉందనే విషయాన్ని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే టీఆర్ఎస్ వైపు నుంచి మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఈ విషయంలో టీఆర్ఎస్ వైఖరిపై తాజాగా క్లారిటీ వచ్చింది. ఈరోజు (జూన్ 27) విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటుగా ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు హాజరుకానున్నారు. ఇందుకు కోసం కేటీఆర్ నేతృత్వంలోని బృందం ఆదివారమే ఢిల్లీ బయలుదేరి వెళ్లింది. దీంతో రాష్ట్రపతి ఎన్నికల్లో యశ్వంత్ సిన్హాకే టీఆర్ఎస్ మద్దతనే విషయంపై స్పష్టత వచ్చింది.
ఇక, నేడు జరిగే యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొననున్నారు. ఆయనతో పాటు టీఆర్‌ఎస్ లోక్‌సభ ఫ్లోర్ లీడర్ నామా నాగేశ్వరరావు, ఎంపీలు రంజిత్‌రెడ్డి, సురేష్‌రెడ్డి, బీబీ పాటిల్, వెంకటేశ్ నేత, కొత్త ప్రభాకర్‌రెడ్డి కూడా యశ్వంత్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వీరంతా ఆదివారమే ఢిల్లీ చేరుకున్నారు.
అయితే కొద్ది రోజులుగా కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ వేదిక కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో ఆయన కాంగ్రెస్‌తో కలిసి సాగేందుకు ఇష్టపడటం లేదు. తమకు బీజేపీ, కాంగ్రెస్ సమాన దూరం అని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిపై చర్చించేందుకు న్యూఢిల్లీలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్‌లు ఏర్పాటు చేసిన రెండు సమావేశాలను టీఆర్‌ఎస్ దూరంగా ఉంది. దీంతో ఆ పార్టీ వైఖరిపై తీవ్రమైన చర్చ సాగింది. యశ్వంత్ సిన్హాను విపక్షాల అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత.. శరద్ పవార్ మాట్లాడుతూ కేసీఆర్ మద్దతు ఇవ్వడానికి అంగీకరించారని చెప్పారు.
అయితే గత కొన్నేళ్లుగా నరేంద్ర మోడీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శకుడైన సిన్హాకు మద్దతు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. సిన్హాకు మద్దతు ఇచ్చినప్పటికీ.. కాంగ్రెస్‌తో ఏకీభవించినట్టుగా కాదని సంబంధిత వర్గాలు తెలిపాయి.