రాజస్తాన్‌లో కాంగ్రెస్‌కు భారీ షాక్.. జూన్ 11న సచిన్ పైలట్ కొత్త పార్టీ!

By Mahesh KFirst Published Jun 6, 2023, 2:52 PM IST
Highlights

రాజస్తాన్‌లో కాంగ్రెస్‌కు సచిన్ పైలట్ భారీ షాక్ ఇవ్వనున్నారు. కాంగ్రెస్ వీడి కొత్త పార్టీని ప్రకటించబోతున్నట్టు సమాచారం. జూన్ 11వ తేదీన ప్రగతిశీల్ కాంగ్రెస్ పార్టీని సచిన్ పైలట్ ప్రకటిస్తాడని తెలిసింది.
 

జైపూర్: రాజస్తాన్‌లో కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, అసంతృప్త నేత సచిన్ పైలట్ పార్టీ వీడనున్నారు. అంతేకాదు, కొత్త పార్టీని స్థాపించడానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఆయన తండ్రి రాజేశ్ పైలట్ వర్ధంతి రోజున అంటే జూన్ 11వ తేదీన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నారు. ఈ పార్టీ పేరు ప్రగతిశీల్ కాంగ్రెస్ అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. జూన్ 11వ తేదీన సచిన్ పైలట్ కొత్త పార్టీ ప్రకటిస్తారా? లేక పార్టీని వీడటం, లేదా మరేదైనా కాంగ్రెస్‌కు హాని తలపెట్టే నిర్ణయం తీసుకోబోతున్నారా? వంటి అనుమానాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

కొత్త పార్టీ ఏర్పాటులో ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ఐప్యాక్ సహరిస్తున్నట్టు తెలిసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన రాష్ట్రంలో థర్డ్ ఫ్రంట్‌తో కలిసి పోరాడటానికి స్కెచ్ వేసినట్టు సమాచారం. హనుమాన్ బెనివాల్‌కు చెందిన రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్పీ), ఆప్‌లతో చేతులు కలిపి కాంగ్రెస్, బీజేపీలతో పోటీపడుతూ థర్డ్ ఫ్రంట్‌లో బరిలోకి దిగబోతున్నట్టు భోగట్టా.

Latest Videos

అయితే, సచిన్ పైలట్‌తో కాంగ్రెస్ నుంచి ఎంత మంది ఎమ్మెల్యేలు బయటకు వెళ్లుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని ప్రమాదంలోకి నెట్టేసే స్థాయిలో ఎమ్మెల్యేలను తీసుకెళ్లుతారా? అనే చర్చ కూడా మొదలైంది.

రాజస్తాన్‌లో కొన్నేళ్లుగా పార్టీ నాయకత్వంలో అంతర్గత పోరు సాగుతున్నది. సీఎం అశోక్ గెహ్లాట్, మరో సీనియర్ నేత సచిన్ పైలట్‌ల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. పలుమార్లు కాంగ్రెస్ అధినాయకత్వం వారిని కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. ఇటీవలే సచిన్ పైలట్ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీలతో సుమారు నాలుగు గంటలపాటు సమావేశమయ్యారు. 

Also Read: Gas Cylinder: రూ.500 లకే గ్యాస్ సిలిండర్... ఆ రాష్ట్ర ప్రజలకు వరం ..

అనంతరం, అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌ల మధ్య సయోద్య కుదిరిందని, సచిన్ పైలట్‌కు తాము గౌరవప్రదమైన స్థానం ఇస్తూ.. అవకాశాలూ ఇస్తామని చెప్పినట్టు కాంగ్రెస్ పేర్కొంది. కానీ, రాహుల్ గాంధీ భరోసాను సచిన్ పైలట్ అంగీకరించలేదని ఆ తర్వాత స్పష్టమైంది. తాను కాంప్రమైజ్ కాబోనని, తన డిమాండ్లపై వెనక్కి తగ్గేది లేదని సచిన్ పైలట్ చెప్పారు.

ఛత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్‌లతోపాటు రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికలూ జరగనున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన తరుణంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్తాన్‌లో పార్టీ మరోసారి సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నదని అర్థం అవుతున్నది.

click me!