
బ్రిటీష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ)కి పంపిన ఇ-మెయిల్‌లో రూ. 40 కోట్ల ఆదాయాన్ని తక్కువగా నివేదించినట్లు అంగీకరించినట్లు పలు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. బీబీసీ ఇండియా కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించిన సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు టార్గెట్‌గా చేసుకున్న సంగతి తెలిసిందే. 2002లో గుజరాత్ అల్లర్లు చెలరేగినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ పాత్ర గురించి డాక్యుమెంటరీని ప్రసారం చేసినందుకు బీబీసీకి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని అనేక ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు. ఐటీ సోదాలను పత్రికా స్వేచ్ఛపై తీవ్రమైన దాడిగా, ప్రతీకార చర్యగా అభివర్ణించారు.
ఆదాయపు పన్ను శాఖ అధికారులను ఉటంకిస్తూ మీడియా నివేదిక ప్రకారం.. ఐటీ శాఖ చర్యలను ప్రతీకార చర్యలో భాగంగా చూపించడానికి బీబీసీ ఇండియా ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించిందని పేర్కొంది. ఇక, ఆదాయపు పన్ను అధికారుల ప్రకారం.. బీబీసీ సవరించిన పన్ను రిటర్న్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది లేదా చట్టపరమైన చర్యను ఎదుర్కోవలసి ఉంటుంది. బీబీసీ ఇండియా బకాయిలను క్లియర్ చేయాలి. పెనాల్టీని చెల్లించాలి. ఈ పెనాల్టీ అనేక కోట్ల వరకు ఉంటుంది.
2023 ఫిబ్రవరిలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఢిల్లీ, ముంబైలోని బీబీసీ ఇండియా కార్యాలయాలను సోదాలు జరిపారు. 2002 గుజరాత్ అల్లర్లపై బీబీసీ యూకేలో రెండు భాగాల డాక్యుమెంటరీని ప్రసారం చేసిన కొన్ని వారాల తర్వాత ఈ సోదాలు జరిగాయి. ఆ సోదాల సమయంలో ఐటీ అధికారులు స్పందిస్తూ.. రికార్డుల్లో చూపిన లాభాలు, ఆదాయం దేశంలో కార్యకలాపాల స్థాయికి అనుగుణంగా లేవని చెప్పారు.
బీబీసీ కార్యాలయాల్లో సోదాలను కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ నిరంకుశత్వం, నియంతృత్వానికి చిహ్నంగా పేర్కొంది. సమాజ్‌వాదీ పార్టీ వంటి పార్టీలు ఈ సోదాలను ‘‘సైద్ధాంతిక అత్యవసర పరిస్థితి’’ పేర్కొన్నాయి. అయితే తాజాగా రూ. 40 కోట్ల ఆదాయాన్ని తక్కువగా నివేదించినట్టు బీబీసీ అంగీకరిస్తున్నట్టుగా ఇ-మెయిల్ ద్వారా సీబీడీటీకి సమాచారం ఇచ్చినట్టుగా మీడియా నివేదికలు వెలువడుతున్న నేపథ్యంలో.. ప్రతిపక్షాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి.