
న్యూఢిల్లీ : ఉక్రెయిన్ (ukraine) , రష్యా (russia) మధ్య నెలకొన్న యుద్ధం నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ ఆందోళన చెందుతున్నాయి. యుద్దం వద్దు శాంతితో సమస్యలు పరిష్కరించుకోవాలని పిలుపునిస్తున్నాయి. అయితే రష్యా మాత్రం యుద్దం విషయంలో ఎవరు చెప్పినా వెనక్కి తగ్గడం లేదు. గురువారం రాత్రి భారత ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (puthin) కు ఫోన్ చేసి.. హింసను ఆపాలని సూచించారు. ఉక్రెయిన్ లో ఉన్న భారతీయ పౌరుల పరిస్థితిపై చర్చించారు.
ప్రస్తుతం రెండు దేశాల జరుగుతున్న యుద్ధం వల్ల ఉక్రెయిన్ లో ఉంటున్న వివిధ దేశాల పౌరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణ పౌరులకు ఎలాంటి హానీ కలిగించబోమని రష్యా చెబుతున్నప్పటికీ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఎంతో మంది ఆందోళనకు గురవుతున్నారు. తము నివసిస్తున్న ప్రాంతాలకు కొద్ది దూరంలోనే బాంబులు పేలుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉక్రెయిన్ లో మన దేశ పౌరులు కూడా దాదాపు 20 వేల మంది వరకు నివసిస్తున్నారు.
చదువు కోసం, ఉద్యోగాల కోసం భారత పౌరులు అక్కడ ఉంటున్నారు. అయితే కొంత కాలం నుంచి ఉక్రెయిన్, రష్యా మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కొంత మంది తిరిగి ఇండియాకు వచ్చేశారు. అయినా చాలా మంది ఇప్పటికీ అక్కడే చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా విమానం ఈ నెల 22వ తేదీన ఉక్రెయిన్ కు వెళ్లి అక్కడ నుంచి దాదాపు 250 మంది స్టూడెంట్లను ఢిల్లీకి తీసుకొచ్చింది. అయితే 24వ తేదీన మరో విమానం ఉక్రెయిన్ కు బయలుదేరినప్పటికీ ఆ దేశంలో విధించిన గగనతల ఆంక్షల ఫలితంగా ఆ విమానం తిరిగి వచ్చేసింది. దీంతో అక్కడున్న విద్యార్థులు, ఇక్కడున్న వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
గగనతల ఆంక్షలు విధించడంతో ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థులను తరలించేందుకు భారత ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెడుతోంది. అందులో భాగంగానే ఉక్రెయిన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా మరో చోటుకు తరలించి అక్కడ నుంచి విమానాల ద్వారా ఇండియాకు తీసుకురావాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే అక్కడున్న దాదాపు 470 మందికి పైగా భారతీయ విద్యార్థులను ఉక్రెయిన్ నుండి రొమేనియా మీదుగా తరలించనున్నట్లు ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది,
రష్యా సైనిక దాడి కారణంగా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు ఎయిర్ ఇండియా శుక్రవారం రొమేనియా (Romania) రాజధాని బుకారెస్ట్ (Bucharest)కు రెండు విమానాలను నడుపుతుందని ప్రభుత్వ సీనియర్ అధికారులు తెలిపారు. రోడ్డు మార్గంలో ఉక్రెయిన్-రొమేనియా సరిహద్దుకు చేరుకున్న భారతీయ పౌరులను భారత ప్రభుత్వ అధికారులు బుకారెస్ట్‌కు తీసుకువెళతారు. అక్కడి నుంచి వారిని రెండు ఎయిర్ ఇండియా విమానాలలో ఇండియాకు తరలించవచ్చని అధికారులు చెబుతున్నారు.
యుద్దం నేపథ్యంలో పౌర విమానాల కార్యకలాపాలన్నీ గురువారం ఉదయం నుంచి ఉక్రెయన్ అధికారులు మూసివేశారు. దీంతో విమనాలు అన్నీ బూకారెస్ట్ నుంచి ల్యాండ్, టేకాఫ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక ఎయిర్ ఇండియా విమానం శుక్రవారం రాత్రి 9 గంటలకు ఢిల్లీ నుండి బయలుదేరింది. మరో విమానం రాత్రి 10.25 గంటలకు ముంబై నుండి బయలుదేరుతుందని అధికారులు చెప్పారు. ఇవి ముందగా బుకారెస్ట్ కు వెళ్లి అక్కడ నుంచి శనివారం భారతదేశానికి బయలుదేరనున్నాయి.
ఉక్రేనియన్ రాజధాని కైవ్ నుంచి రొమేనియన్ బార్డర్ వరకు దాదాపు 600 కిలోమీటర్లు దూరం ఉంది. కైవ్ నుంచి అక్కడికి రోడ్డు మార్గం ద్వారా చేరుకోవడానికి దాదాపు 11 గంటల సమయం పడుతుంది. రొమేనియన్ బార్డర్ నుంచి బుకారెస్ట్ దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరియు రోడ్డు మార్గంలో దూరాన్ని చేరుకోవడానికి ఏడు నుండి తొమ్మిది గంటల వరకు పడుతుంది. విద్యార్థులు ప్రయాణం చేస్తున్న బస్సులపై భారత జెండాను ప్రముఖంగా ప్రింట్ చేయాలని భారత ప్రభుత్వ అధికారులు సూచించారు.