
UP Elections 2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. ప్రధాన పార్టీల నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. తాజాగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాంగ్రెస్ పార్టీ,సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి), బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి)లపై సంచలన కామెంట్స్ చేశారు. యూపీలో బీజేపీనే మళ్ళీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఐదవ దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా..యూపీలోని సుల్తాన్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో సీఎం యోగీ ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ఈ క్రమంలో యోగి ఆదిత్యనాథ్ విపక్షాలపై విరుచుకుపడ్డారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మార్చి 10న ప్రకటించబడతాయని, ఇప్పటికే నాలుగు దశల పోలింగ్ జరిగిందని, ఐదో విడత పోలింగ్ జరగాల్సి ఉందని వెల్లడించారు. ఎన్నికల ఫలితాల తర్వాత విపక్ష నేతలంతా మార్చి 11న రాష్ట్రం నుంచి బయటికి వెళ్లేందుకు విమానాలు బుక్ చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు
బీఎస్పీ హయాంలో ఆ పార్టీ ఏనుగు కడుపు చాలా పెద్దదని, దీంతో యూపీలో రేషన్ అంతటినీ బీఎస్పీ ఏనుగు మింగేసిందని సీఎం యోగి ఆదిత్యానాధ్ మాయావతి పై విరుచుకుపడ్డారు. రేషన్ విధానంలోని తప్పులను ఎత్తి చూపారు యోగి ఆదిత్యనాథ్.
అంతకుముందు, మాయావతి తన బిఎస్‌పి పార్టీ బి టీమ్ కాదని, ప్రత్యర్థులు తన మద్దతుదారులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, అధికార బిజెపితో ఎన్నికల అనంతర పొత్తు గురించి ఊహాగానాలకు ముగింపు పలకాలని కోరింది. అల్లర్లను ప్రేరేపించే పార్టీ కావాలో..పేదల సంక్షేమానికి పాటుపడే పార్టీ కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని అన్నారు.
అంతకుముందు యోగి ఆదిత్యానాధ్ అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులను పరిశీలించారు. రామాలయ నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. ఫిబ్రవరి 27న ఐదో దశ పోలింగ్ జరగనుంది. ఈ దశలో అయోధ్య, రాయ్ బరేలి, అమేధి జిల్లాలు సహా తూర్పు ప్రాంతంలో పోలింగ్ జరగనుంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం యోగి ఆదిత్యానాధ్ గోరఖ్‌పూర్ అర్బన్ నుంచి పోటీ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ ఎన్నికల నేపథ్యంలో న్యూఢిల్లీలోని సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయ మైదానంలో బీజేపీకి చెందిన బూత్ స్థాయి కార్యకర్తలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. ఫిబ్రవరి 27న బూత్ స్థాయి కార్యకర్తలతో ప్రధాని సమావేశం కానున్నారని, అన్ని ఏర్పాట్లను ముమ్మరం చేశామని బీజేపీ రాష్ట్ర కో-ఇన్‌చార్జి సునీల్ ఓజా తెలిపారు.
మరోవైపు.. యూపీ ఎన్నికల ప్రచారంలో ఇప్పటి వరకూ 1,137 ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనల కేసులు నమోదైనట్టు ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి హింసాత్మక సంఘటనలు లేదా ఘర్షణలు చోటుచేసుకోలేదని డీజీపీ ప్రధాన కార్యాలయ అధికారులు తెలిపారు. అధునాతన పోలీసు సన్నద్ధత మరియు కేంద్ర పారామిలటరీ బలగాలను భారీగా మోహరించడం వల్ల ఇది సాధ్యమైందని యూపీ పోలీసుల తెలిపారు.
ఇక, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మళ్లీ పాలనా పగ్గాలు చేపట్టాలని అధికార బీజేపీ సర్వశక్తుల పోరాడుతుండగా.. యోగి సర్కార్‌పై వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అధికారాన్ని హస్త గతం చేసుకోవాలని అఖిలేష్ యాదవ్ సారధ్యంలోని ఎస్పీ చెమటోడుస్తోంది. ఇక ప్రధాన పార్టీలకు దీటుగా సత్తా చాటాలని కాంగ్రెస్, బీఎస్పీలు పావులు కదుపుతున్నాయి. బ ఇక ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకూ ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.