
కైవ్ (Kyiv) విమానాశ్రయం మూసివేయడంతో ఉక్రెయిన్ (Ukraine) నుంచి భారతీయులను తీసుకురావడం సవాలుగా మారింది. దీంతో అక్కడ చిక్కుకున్న మన భారతీయులు బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. తమని ఎలాగైనా ఇండియా (india)కు తీసుకెళ్లాలని కోరుతున్నారు. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో వారిని సురక్షితంగా ఉంచడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో వారిని రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది.
ఉక్రెయిన్ (Ukraine)లో చిక్కుకున్న దాదాపు 16,000 మంది భారతీయులను ముందుగా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రోడ్ మ్యాప్ (road map) లు సిద్ధం చేశామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు భారత విదేశాంగ కార్యదర్శి హర్ష వర్ధన్ ష్రింగ్లా (Harsh Vardhan Shringla) గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘ మేము భారతీయుల తరలింపును అత్యంత ముందు జాగ్రత్తతో నిర్వహిస్తాము. కైవ్ నుంచి భారతీయ పౌరులను ఖాళీ చేయడానికి, సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రోడ్ మ్యాప్ లు తయారు చేశాం ’’ అని ఆయన పేర్కొన్నారు.
ఉక్రెయిన్ (Ukraine), రష్యా (Russia) మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్తితుల నేపథ్యంలో ఇప్పటికే దాదాపు 4000 మంది భారతీయులు ఉక్రెయిన్‌ను విడిచిపెట్టారు. ‘‘ గత కొన్ని రోజుల నుంచి 4000 మంది భారతీయులు ఉక్రెయిన్‌ను విడిచిపెట్టారు. ఢిల్లీలోని MEA కంట్రోల్ రూమ్‌కు 980 కాల్స్, 850 ఇమెయిల్‌లు వచ్చాయి ’’ అని భారత విదేశాంగ కార్యదర్శి హర్ష వర్ధన్ ష్రింగ్లా తెలిపారు.
ఉక్రెయిన్‌లోని తమ రాయబార కార్యాలయం ఇంకా పనిచేస్తోందని హర్ష వర్ధన్ ష్రింగ్లా చెప్పారు. తమ విద్యార్థులకు భద్రత కల్పించడానికి యూనివర్సిటీలతో, స్టూడెంట్ కాంట్రాక్టర్లతో టచ్ లోెనే ఉన్నాము అని తెలిపారు. ‘‘ ఉక్రెయిన్‌లోని మా రాయబార కార్యాలయం యాక్టివ్ గా పని చేస్తోంది. ఎప్పటికప్పుడు మా రాయబార కార్యాలయం అనేక సలహాలు అందిస్తున్నది. ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితులను ఎదుర్కోవటానికి అనేక చర్యలు తీసుకుంటున్నాం. దాదాపు నెల రోజుల క్రితం ఉక్రెయిన్‌లో భారతీయ పౌరుల నమోదు కార్యక్రమం ఆన్ లైన్ ద్వారా ప్రారంభించాం. ఈ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఆధారంగా, 20,000 మంది భారతీయులు ఉక్రెయిన్ లో ఉన్నారని ఒక అంఛనాకు వచ్చాం ’’ అని ఆయన తెలిపారు.
ఇదిలా ఉండగా ఇప్పటికే భారతీయ రాయబార కార్యాలయ అధికారులు దాదాపు 200 మంది భారతీయ స్టూడెంట్లకు ఆశ్రయం కల్పించారు. ఉక్రెయిన్ రాజధాని కైవ్ సమీపంలోని ఓ స్కూల్ లో స్టూడెంట్లకు రక్షణ ఏర్పాటు చేశాం. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఇండియన్ ఎంబసీ విడుదల చేసింది. ఇందులో ఉక్రెయిన్‌లోని భారత రాయబారి విద్యార్థులతో మాట్లాడుతున్నట్టు కనిపించింది. కాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (vladimir putin) తో భారత ప్రధాని నరేంద్ర మోడీ (pm modi) గురువారం రాత్రి మాట్లాడారు. ఉక్రెయిన్ పై ఘర్షణను తక్షణం నిలిపివేయాలని కోరారు. ఉక్రెయిన్ లో ఉన్న భారతీయల కోసం, భారతీయ స్టూడెంట్ల రక్షణ తమకు అత్యంత ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో అన్నారు. దౌత్య చర్చల ద్వారా రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించుకోవాలని ప్రధాని సూచించారు.